విశ్లేషణ: ఫిరాయింపు రాజకీయాలపై కర్ణాటక తీర్పు ఎలా ఉండబోతోంది?

  • Publish Date - November 28, 2019 / 11:22 AM IST

డిసెంబర్ 5 ఉప ఎన్నికల్లో ఫిరాయింపు రాజకీయాల కర్నాటక మీద తీర్పు రాబోతున్నట్లే. ఈ మొత్తం 15 సీట్లలో కనీసం 6 సీట్లను బీజేపీ గెల్చుకొంటే అధికారానికి ఢోకాలేదు. లేదంటే… కొత్తగా కొంతమందిని మళ్లీ ఎత్తుకెళ్లాలి. బీజేపీ పాచిక విసిరింది. అనుకూలంగా ఫలితం రావాలి. బైపోల్స్ ఎప్పుడూ అధికారపార్టీకి అనుకూలంగానే వస్తాయి. రావాలి. ఒకవేళ జనం కనుక బీజేపీని ఛీకొడితే పరిస్థితి మళ్ళీ మొదటకొస్తుంది.

కర్నాటకలో 2018లో పెద్ద పార్టీగా సీట్లు సాధించినా… కాంగ్రెస్ చొరవతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యేసరికి… గొడవ చేసింది బీజేపీ. ప్రజాతీర్పుకు వ్యతిరేకమని గోల చేసింది. చివరకు.. అమిత్ షా రాజకీయాలతో… కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప పీఠమెక్కారు. ఇదో ప్రసహనం. కర్నాటక రాజకీయ చైతన్యం మీద సందేహాలు రేకిత్తించిన కాలమది.

ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలు, సిద్ధాంతాలు, భావజాలాల ప్రదర్శన మీద ఓటర్లు ఓట్లు వేశారు. బీజేపీకి మెజార్టీ దగ్గకలేదు. అలాగని ఆగలేదు. జనం మౌన ప్రేక్షకుల్లా చూస్తుంటే….రాజకీయ రంగస్థలం మీద ప్రదర్శనలు మొదలైయ్యాయి. ఎడమొఖం పెడముఖంగా ఉన్న కాంగ్రెస్, జేడీ(ఎస్)లు అధికారాన్ని చేపట్టగానే… మోసపోయినట్లు బీజేపీ తన వాదనను వినిపించింది. కేంద్రంలో దన్నుతో…కర్నాటక బీజేపీ కుమారస్వామి ప్రభుత్వానికి దినదినగండమనిపించింది. చివరకు… పార్టీని చీల్చింది… ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది.

ఒకవిధంగా కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య చెడిన సంబంధాల వల్ల ఇరుపార్టీల నుంచి కొందరిని తనవైపుకు యడ్యూరప్ప లాక్కున్నారు. కర్నాటక మాజీ స్పీకర్ వెళ్లిపోతూ వీళ్ల మీద అనర్హత వేటువేశారు. దాని ఫలితమే ఈ ఉపఎన్నికలు. ఒకవేళ బీజేపీని జనం తిరస్కరిస్తే..బీజేపీ మైనార్టీలో పడిపోయింది. అలాగని కూలిపోతుందని అనుకోలేం. మనసు, ధోరణి రెండూ మార్చుకున్న కుమార స్వామి మాత్రం అవసరమైతే యడ్యూరప్పకు మద్దతివ్వడానికి ఆలోచిస్తున్నానని తేల్చేశారు. అందువల్ల.. బీజేపీకి తక్షణం వచ్చిన ముప్పేమీ ఉండకపోవచ్చు.

మూడు పక్షాల్లో బలహీనమైన జేడీఎస్ బలమైన బీజేపీతో పొత్తుకుదుర్చుకోవాలనుకొంటోంది. కుమారస్వామిది మనుగడకోసం పోరాటం. అందుకే ఉప ఎన్నికల్లో జనం తిరస్కరించినా… బీజేపీకి దన్నుగా నిలబడటానికి ఆయన నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడే అవకాశాల్లేవు.

ఇదేసమయంలో, బలనిరూపణ సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ విప్ లను ధిక్కరించిన వారిపై స్పీకర్ అనర్హత వేటువేసిన తర్వాత 1985 ఫిరాయింపు నిరోదక చట్టంలోని లోపాలు బైటకొచ్చాయి. ఈ శాసనసభ కాలవ్యవధి పూర్తయ్యేదాకా మళ్లీ ఎన్నికల్లో పోటీచేయకూడదని స్పీకర్ రూలింగ్ ఇచ్చినా, సుప్రీంకోర్టు మాత్రం అనర్హత కాలాన్ని ఆయన నిర్ణయించజాలరని తేల్చేసింది. అందువల్ల ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు డిసెంబర్ 5 ఎన్నికల్లో నిలబడుతున్నారు, అదీ బీజేపీ తరుపున.

Also Readఎగరని బీజేపీ జెండా..తృణముల్ క్లీన్ స్వీప్

దీనర్ధం ఒక్కటే. ఒకవేళ ఫిరాయించినా దాని ప్రభావం కొంతవరకే. అందుకే 1960,70ల నాటి ఆయారామ్ గయారాం రాజకీయాలకు ఫిరాయింపు నిరోధక చట్టం కొంతవరకు చట్టబద్ధతను తీసుకొచ్చినట్లే.

ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయ విన్యాసాల ప్రభావం కర్నాటక మీద ఉండే అవకాశాలున్నాయి. కాకపోతే మహాలో రాజకీయ ఉద్ధండులు ఎక్కువ. సిద్ధరామయ్యను కాచుకోవడం కుమారస్వామికి కష్టమైపోయింది. సంకీర్ణాన్ని నడపకలేక రెండుసార్లు కన్నీళ్లుపెట్టుకున్నారు. ఉక్కుసంకల్పానికి బదులు సానుభూతితోనే కాంగ్రెస్ ను నియంత్రించాలనుకున్నారు. అది సాధ్యంకాలేదు. కుర్చీని నిలబెట్టుకోవాలన్న తపన తప్ప ఎలాంటి ప్రణాళికాలేని కుమారస్వామికి… చూస్తుండగానే అధికారం చేజారిపోయింది.

కాంగ్రెస్ తో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నతర్వాత మళ్లీ కుమారస్వామికి ఆధికారంమీద వ్యామోహం మళ్లీ కలుగుతోంది. కనీసం అధికారపార్టీకి మద్దతిచ్చి తానూ కొంత లాభపడాలన్న ధోరణిలోనే ఆయన ఉన్నారు.  అదష్టం కలసివస్తే… బీజేపీతో డీల్ కుదుర్కోవాలని కలలుగంటున్నారు. నిజానికి, తాను నిలబడటం కోసం పార్టీలను ఎలా వాడుకోవాలి బీజేపీకి బాగా తెలుసు.

జేడీఎస్ సాయం లేకుండా ప్రభుత్వాన్ని నడపాలంటే 15 సీట్లలో ఆరింటిని గెలిస్తేచాలు. ఒకవేళ ఫిరాయింపుదారులను ప్రజలను దారుణంగా ఓడిస్తే… కుమారస్వామి ఫ్రెండ్ షిప్ కావాలి. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే 5 సీట్లలోనే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే… జేడీఎస్ మద్దతుకావాలి. కుమారస్వామి కల కూడా అదే.

రాజకీయ ఎత్తుగడలు, అధికారకోసం పెనుగులాట మధ్య కర్ణాటక బాగా ఇబ్బంది పడుతోంది. ఒకప్పుడు మిగిలిన మెట్రోలు అసూయగా చూసే బెంగుళూరు ఇప్పుడు కుప్పకూలిన మౌళికసదుపాయాలతో పెట్టుబడులను కోల్పోతోంది. పరిపాలన గాడితప్పితే రాష్ట్రం ఎంతగా నష్టపోతోందో చెప్పడానికి కర్ణాటక ఓ ఉదాహరణ.