కేరళలో రాష్ట్రపతి పాలన పెట్టాలంట!….యడియూరప్ప సన్నిహితురాలు డిమాండ్

కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడంపై ఆదివారం(ఫిబ్రవరి-23,2020) ట్విటర్ వేదికగా స్పందించారు.

శనివారం కేరళ పోలీసులు కొల్లాం జిల్లా కులతుపుజలోని ఓ వంతెన సమీపంలో 14 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ బుల్లెట్లపై ‘పీవోఎఫ్’ అనే మార్కింగ్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం దీనిపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

గతంలో రాష్ట్ర పోలీసు ఆయుధాగారం నుంచి అదృశ్యమైన బుల్లెట్లు, రైఫిళ్లు దొరికాయి. ఇప్పుడు కొల్లాం జిల్లాలోని కులతుపుజలో ఓ బ్రిడ్జి దగ్గర 14 లైవ్ బుల్లెట్లు దొరికాయని శోభ తెలిపారు. కేరళలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి మద్దతు ఇస్తున్న హిందువులు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని శోభ ఆరోపించారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మాణం మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిన విషయం తెలిసిందే. కేరళ తర్వాతనే చాలా రాష్ట్రాలు సీఏఏ వ్యతిరేక తీర్మాణాలు చేశాయి.