Modi America Tour : ప్రధాని మోడీ అమెరికా పర్యటన…ఐదు కంపెనీల సీఈవోలతో భేటీ

అమెరికా ఐదు కంపెనీల అధినేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. డిజిటల్‌ ఇండియా, 5G, రక్షణ, పునరుత్పాధక ఇంధనం, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులకు భారత్ మంచి అవకాశాలు అందిస్తుందన్నారు.

Modi met American companies’S CEOs : అమెరికాకు చెందిన ఐదు దిగ్గజ కంపెనీల అధినేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మొదట క్వాల్‌కామ్‌ సీఈఓ క్రిస్టియానో అమోన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత భారత సంతతికి చెందిన అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌తో పాటు ఫస్ట్‌ సోలార్‌ సీఈఓ మార్క్‌ విడ్మార్, బ్లాక్‌స్టోన్‌, జనరల్‌ అటామిక్స్‌ సంస్థల సీఈఓలతోనూ భేటీ అయ్యారు. డిజిటల్‌ ఇండియా, 5G, రక్షణ, పునరుత్పాధక ఇంధనం, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్ మంచి అవకాశాలను అందిస్తున్నదని ప్రధాని మోడీ వారికి తెలిపారు.

భారత ప్రధానితో నిర్మాణాత్మక చర్చలు జరిపినట్టు క్వాల్‌కామ్‌ సీఈఓ క్రిస్టియానో ప్రకటించారు. భారత్‌తో టెక్నాలజీని పంచుకోవడం గర్వంగా ఉందని.. త్వరలోనే భారత్‌లో 5G సేవల విస్తరణ గురించి ప్రధానితో చర్చించినట్టు ప్రకటించారాయన. భారత్‌లో ఉండే అవకాశాలను సరిగా అందిపుచ్చుకునేందుకు కృషి చేస్తామని క్వాల్‌కమ్ సీఈఓ తెలిపారు.

PM Modi : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, ఆస్ట్రేలియా ప్రధానిని కలిసిన ప్రధాని మోడీ

ఇక భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించడం ఇది ఏడోసారి. రేపు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక అదేరోజు వైట్‌హౌస్‌లో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోను మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో అఫ్ఘానిస్తాన్ పరిణామాలు, ఇండో-పసిఫిక్‌ అజెండా, కోవిడ్‌-19, వాతావరణ మార్పులు వంటి అంశాలు చర్చకు రావచ్చు. అదేరోజు బైడెన్‌ ఇచ్చే డిన్నర్‌కు హాజరై.. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్తారు.

ఇక పర్యటనలో చివరిరోజు అయిన ఎల్లుండి.. న్యూయార్క్ లో జరిగే 76వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు మోదీ. కరోనా, ఉగ్రవాదం అంశాలను ప్రస్తావించనున్నారు. అఫ్ఘానిస్తాన్ పరిణామాలపై మనదేశ వైఖరిని అక్కడే ప్రకటించే అవకాశం ఉంది. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపైనా చర్చించే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితిలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు