జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ

మూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యలను పరామర్శించారు. జైట్లీకి నివాళులర్పించారు. మోడీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. అనారోగ్య కారణాలతో శనివారం(ఆగస్టు-24,2019)జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే.

మోడీకి జైట్లీ అత్యంత ఆప్తుడన్న విషయం ప్రత్యేకంగా. మోడీ కేబినెట్ 1.0లో ఐదేళ్లపాటు అరుణ్ జైట్లీ కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ నుంచే జైట్లీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 

జైట్లీ మరణవార్త వినగానే  విదేశాల్లో ఉన్న మోడీ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. జైట్లీ కుటుంబసభ్యలకు ఫోన్ చేసి మాట్లాడారు. తన పర్యటన రద్దు చేసుకుని భారత్ కు రావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జైట్లీ కుటుంబసభ్యల సూచన మేరకు విదేశీ పర్యటనను కొనసాగించారు. ఢిల్లీ వచ్చిన వెంటనే జైట్లీ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. గొప్ప నాయకుడుని కోల్పోయామంటూ రెండు రోజుల క్రితం బహ్రెయిన్ లో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో జైట్లీని మోడీ గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే.