రామ్ జెఠ్మలానీకి నివాళులర్పించిన ప్రధాని

అనారోగ్యంతో ఇవాళ(సెప్టెంబర్-8,2019)ఉదయం కన్నుమూసిన ప్రముఖ న్యాయవాది,మాజీ కేంద్రమంత్రి రామ్ జెఠ్మలానీ(95)కి ప్రధాని మోడీ నివాళులర్పించారు. జెఠ్మలానీ నివాసానాకి వెళ్లిన మోడీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళుర్పించారు. జెఠ్మలానీ కుటుంబసభ్యులను మోడీ ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు.

 రామ్ జెఠ్మలానీ మృతితో భారత్ ఒక అసాధారణ న్యాయవాదిని, న్యాయస్థానం, పార్లమెంటు రెండిట్లో భాగస్వామ్యం అందించిన ఒక ఐకానిక్ పబ్లిక్ ఫిగర్‌ ను కోల్పోయిందని అంతకుముందు మోడీ ట్వీట్ చేశారు. ఆయన చమత్కారి, సాహసికులని అన్నారు. ఏ విషయం మీదైనా ఓపెన్‌గా మాట్లాడటానికి ఆయన భయపడేవారు కాదన్నారు. ఆయనలోని మంచి కోణం తన మనసుతో మాట్లాడే సామర్థ్యం ఉండడం. ఆయన భయపడేవారు కాదు. అత్యవసర స్థితిలో జెఠ్మలానీ ప్రజల కోసం పోరాటం చేశారు.

అవసరమైనవారికి సాయం చేయడం ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. ఎన్నో సందర్భాల్లో ఆయనతో స్వయంగా మాట్లాడే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన చేసినవి సజీవంగా ఉంటాయి. ఓం శాంతి అంటూ మోడీ తన ట్వీట్ లో తెలిపారు.