విల్లు చేతబట్టి…రావణసంహారం చేసిన మోడీ

భారత్ ఉత్సవాల పుణ్యభూమి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలన్నారు. ఇవాళ(అక్టోబర్-8,2019) ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లోని రామ్ లీలా మైదానంలో జరిగిన దసరా కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ మోడీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

భారత్‌.. పండుగల పుణ్యభూమి అని, వివిధ ప్రాంతాల ప్రజలను పండుగలు కలుపుతాయని ఆయన అన్నారు. ఉత్సవాలు సామూహిక శక్తిని ఇస్తాయని, పండుగలు భారతీయులను ఉత్తేజితం చేస్తాయన్నారు. దేశంలో ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఉత్సవాలు జరుగుతుంటాయని గుర్తుచేశారు. మన దేశంలో పండుగలు… మన విలువలు, విద్య,సామాజిక జీవితంలో భాగం అని మోడీ తెలిపారు. మన సంప్రదాయం చెడుపై పోరాటం చేస్తుందన్నారు. భారత్‌ రోబోలను రూపొందించదని, మానవులను తయారు చేస్తుందన్నారు. రాముడు సామూహిక శక్తితో వంతెన నిర్మించి లంక దాటారని అన్నారు.

అమ్మను  పూజించే భూమి మానదని. భారతదేశంలోని ప్రతి కుమార్తెను గౌరవించడం మన బాధ్యత అన్నారు. మన ఆడబిడ్డలు మనకు “లక్ష్మి”అని మన్ కి బాత్ సమయంలో కూడా తాను చెప్పానని మోడీ అన్నారు. రాబోయే దీపావళికి వారి విజయాలను జరుపుకుందామని మోడీ అన్నారు. ఈ సందర్భంగా విల్లు చేతబట్టి రావణాసురుడి దిష్ఠిబొమ్మను దహనం చేశారు ప్రధాని మోడీ.