ఢిల్లీ నుంచి లండన్ కి డైరక్ట్ బస్సు

ఇకపై ఢిల్లీ నుంచి లండన్ కి బస్సులో కూడా వెళ్లవచ్చు. అవును ఇది నిజమే. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న “అడ్వెంచర్స్‌ ఓవర్‌ల్యాండ్‌” అనే ప్రైవేట్ టూరిస్ట్ కంపెనీ ఈ సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల వీసా ఏర్పాట్లను కూడా కంపెనీ చూసుకుంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

మే 2021లో ఈ బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. దీనికి బస్ టూ లండన్ అని పేరు పెట్టారు. బస్సు లో ఢిల్లీ నుంచి లండన్ చేరుకోవడాని 70 రోజులు పడుతుంది. సుమారు 18 దేశాల గుండా ఈ బస్సు ప్రయాణం సాగుతుంది. మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్, చైనా, కిర్గిస్తాన్‌, కజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, బెల్జియం, యునైటెడ్ కింగ్‌డమ్ మార్గంలో బస్‌ జర్నీ ఉంటుంది.

ఈ యాత్ర కోసం బిజినెస్ క్లాస్ సీట్లతో కూడిన 20 సీట్ల ప్రత్యేక బస్సును రెడీ చేస్తున్నారు. 20 మంది ప్రయాణికులే కాకుండా, డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గైడ్ మరియు సహాయకుడు ఉంటారు.

నాలుగు కేటగిరీలుగా ఈ ట్రిప్ ను విభజించారు. ప్రయాణీకులు తమ ఇష్టానికి మరియు సౌలభ్యం ప్రకారం వేర్వేరు గమ్యస్థానాలను ఎంచుకోవచ్చు, అయితే వారు నిర్దిష్ట ప్యాకేజీ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వారు ఢిల్లీ నుండి లండన్ వరకు మొత్తం యాత్రను ఉపయోగించుకుంటే ఒక్కొక్కరికి రూ .15 లక్షలు ఖర్చవుతుంది.