కాంగ్రెస్‌కు షాక్… ప్రియాంక చతుర్వేది రాజీనామా

  • Publish Date - April 19, 2019 / 07:47 AM IST

ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి  మరోషాక్ తగిలింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేశారు.  ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండుపేజీల లేఖను పంపించారు. గతంలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన నేతలకు పార్టీలో పెద్ద పీట వేస్తున్నారని రౌడీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రియాంక చతుర్వేది తన రాజీనామా లేఖలో  ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోని‌ అన్ని పదవులకు పార్టీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసారు. 

ప్రస్తుతం కాంగ్రెస్ లో అధికార ప్రతినిధి,మీడియా కన్వీనర్‌గా ప్రియాంక పనిచేస్తున్నారు. తన  ట్విట్టర్ ఎకౌంట్ లో  ఏఐసీసీ అధికార ప్రతినిధి హోదాను కూడా తొలగించారు. ఆమె తన బాధతో పార్టీని వీడుతున్నానని  ప్రియాంక రాహుల్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. పదేళ్ళ క్రితం ముంబయి యూత్ కాంగ్రెస్ ద్వారా పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రియాంక చతుర్వేది ప్రారంభించారు. ఇటీవల మథురలో ప్రియాంక చతుర్వేది‌పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కాంగ్రెస్  పార్టీ సస్పెన్షన్ విధించింది. కాగా…తనపై అసభ్యంగా ప్రవర్తించిన వారిపై సస్పెన్షన్ ఎత్తివేయడం పట్ల ఆమె ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసారు. ఆమె ఇవాళ శివసేన పార్టీలో చేరుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.