పౌర “రణం” : విద్యార్థులపై దాడిని ఖండిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులు,ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యను తప్పుబట్టారు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. విద్యార్థులపై పోలీసుల చర్యను ఖండిస్తూ ఇవాళ(డిసెంబర్-16,2019)సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆందోళనకారుల నిరసనలకు ఆమె సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏకే ఆంటోనీ,కేసీ వేణుగోపాల్,పీఎల్ పునియా,అంబికా సోని,అహ్మద్ పటేల్ వంటి ముఖ్య నాయకులు,పార్టీ కార్యకర్తలు,ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాఠీలు వద్దు రోటీలు కావాలంటూ ప్రియాంక నినాదాలు చేశారు. ఇండియా గేట్ పరిసరాల్లో ముందుజాగ్రత్తగా మెట్రో స్టేషన్లు మూసివేశారు.

కాగా ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఆదివారం ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టడంతో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా విద్యార్థులు ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని సహా, పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై హింసాత్మక నిరసనలు దురదృష్టకరం. తీవ్ర బాధను కలిగిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు.