ఫార్మర్స్ వర్సెస్ పోలీస్ : ట్రాక్టర్ తో బారికేడ్లను తొక్కించుకుంటూ ముందుకు

tractor over a police barricade in Bajpur కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా,యూపీ, ఉత్తరాఖండ్,మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు నెల రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఈ నిరసన జరుగుతోంది.

ఈ క్రమంలో ఇవాళ ఉత్తరాఖండ్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉత్తరాఖండ్‌ లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో రైతులు, పోలీసులకు మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. బాజ్ పూర్ ప్రాంతంలో రైతులు ఆందోళనలు చేస్తుండగా… వారు మరింత ముందుకు రాకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, ఓ రైతు తన ట్రాక్టర్‌తో ఆ బ్యారికేడ్లను ఢీకొని ముందుకు వెళ్లాడు. ట్రాక్టర్ ముందుకు రాకుండా పోలీసులు బ్యారికేడ్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ. ట్రాక్టర్ నడుపుతున్న రైతు మాత్రం దూకుడుగా బ్యారికేడ్‌ను దాటి ముందుకు వెళ్లాడు.

మరోవైపు, వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రైతులకు భరోసా కల్పించేందుకు వ్యవసాయ చట్టాల్లో కావాల్సిన కొన్ని మార్పులు మాత్రం చేస్తామని చెప్పింది. అయితే, వాటిని రైతులు తిరస్కరించారు. చట్టాలను రద్దు చేయాలనేదే తమ డిమాండ్ అని, అది చేయకుండా ప్రభుత్వం తమ మీద తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్‌లో సరైన చర్చ జరపకుండా ఆమోదించిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సమస్యను పరిష్కరించేందుకు ఓ ప్యానెల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే.

మరోవైపు రాజకీయాల కోసమే రైతులను రెచ్చగొడుతున్నాయని విపక్షాలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయకుండా అక్కడి రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బెంగాల్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేయని మమతా బెనర్జీపై ఒక్కమాట కూడా మాట్లాడని పార్టీలు.. రైతులకు మేలు చేసే కొత్త వ్యవసాయ చట్టాలపై మాత్రం రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పశ్చిమ బెంగాల్, కేరళలో మండీలు, ఏపీఎంసీల వ్యవస్థను నాశనం చేసిన వారే.. ఇప్పుడు పంజాబ్ రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. కేరళలో ఎందుకు ఆందోళనలు చేయడం లేదని మోడీ ప్రశ్నించారు.