Delhi Formers : ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడదా, పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న రైతన్నలు

Formers

Protesting Farmers : సాగు చట్టాలపై రైతుల ఆందోళన ఇప్పట్లో ముగియదా? మోదీ సర్కార్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు రైతులు సిద్ధమయ్యారా? ఢిల్లీ సరిహద్దులో పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. రైతులు సుదీర్ఘ కాలంగా ఉద్యమం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోదీ పదవీ కాలం ముగిసేవరకూ పోరాడతామన్న రైతులు ఆ దిశగా తమ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు ఏకంగా శాశ్వత నివాసాలు ఏర్పరచుకుంటున్నారు.

టిక్రీ, సింఘు సరిహద్దులో టెంట్లు, తాత్కాలిక షెడ్లకు బదులు మట్టి, సిమెంట్‌, ఇటుకలతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 12 ఇళ్లను నిర్మించారు. రానున్న రోజుల్లో మరికొన్ని ఇళ్లను నిర్మించుకోనున్నారు. చలి, వాన, ఎండనక ఆందోళన చేస్తున్న రైతులు- అన్నిరకాల వాతవరణాన్ని తట్టుకునేందుకు వీలుగా ఇళ్లను నిర్మిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో టిక్రీ, సింఘు తదితర ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇటుకలు, ఇసుక రాసులుగా కనిపిస్తున్నాయి. రైతులే మేస్త్రీలు, కూలీలుగా మారి ఇళ్లను నిర్మించుకుంటున్నారు.

ఇప్పటివరకు అన్నదాతలు ట్రాక్టర్‌ ట్రాలీలను నివాసాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఈ ట్రాలీలను తమ తమ గ్రామాలకు పంపేయాలని చూస్తున్నారు. త్వరలో గోధుమ పంట కోతలు ప్రారంభం కానుండడంతో ట్రాలీలను తరలించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ట్రాలీలు పంపిస్తే ఉండడానికి నీడ ఉండదని….అందుకే ఇళ్లను కట్టుకుంటున్నట్లు రైతులు వెల్లడించారు. కొన్ని మట్టి ఇండ్లు, మరికొన్ని సిమెంట్‌, ఇటుకలతో నిర్మిస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి దాదాపు 20 వేల రూపాయల నుంచి 30 వేలు ఖర్చవుతోంది. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన 100 రోజులు దాటింది. సాగు చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.