కర్నాటకలో టెన్షన్ : శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా ఆందోళనలు

  • Publish Date - September 4, 2019 / 05:29 AM IST

కర్నాటకలో టెన్షన్. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన డీకే శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. రోడ్లు బ్లాక్ చేశారు. బీజేపీ కక్ష సాధింపు అంటూ వాయిస్ వినిపించారు కాంగ్రెస్ లీడర్స్. శివకుమార్ మద్దతుదారులకు మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామి మద్దతు ఇవ్వటంతో.. మరింత రెచ్చిపోయారు కార్యకర్తలు.

రామనగర్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు యాజమాన్యాలు. బెలగావి-బగల్కోట్ జాతీయ రహదారిని బంద్ చేశారు ఆందోళనకారులు. టైర్లను నిప్పుపెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు శివకుమార్ ఫ్యాన్స్. రామనగర్ జిల్లాలోని చాలా బస్ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో బస్సులకు నిప్పు పెట్టారు. ఆందోళనలకు భయపడిన వ్యాపారులు కొన్ని ప్రాంతాల్లో దుకాణాలను స్వచ్చంధంగా మూసివేశారు. సినిమా ధియేటర్లలో కూడా షోలు రద్దు చేశారు. 

డీకే శివకుమార్ అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా చెప్పుకొచ్చారు ఆయకు సోదరుడు సురేష్. CISF, ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల అదుపులో ఉన్నారని వెల్లడించారాయన. కలుసుకోవటానికి కూడా అనుమతి ఇవ్వటం లేదని ప్రకటించారాయన. ఆందోళనలు, నిరసనలపై కర్నాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ గుండూరావు స్పందించారు. శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారాయన. డీకే శివకుమార్ ను ఆరోగ్యం నిలకడగా ఉందని, కోర్టులో హాజరుపరుస్తామని ప్రకటించారు అధికారులు. మనీ ల్యాండరింగ్ కేసులో సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.