PSLV-C61 Rocket
PSLV-C61 Rocket: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) ఇందుకు వేదికైంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ శనివారం ఉదయం 7.59గంటలకు ప్రారంభంకాగా.. ఇది 22 గంటలపాటు కొనసాగాక పీఎస్ఎల్వీ వాహక నౌక షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.59 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన ఈఓఎస్-09(రీశాట్-1బి) ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి తీసుకెళ్లింది.
ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరాక 17 నిమిషాల వ్యవధిలో ఈఓఎస్-09 ఉపగ్రహాన్ని రోదసిలో సూర్య అనువర్తిత ధ్రువ క్షక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే. ఈ ప్రయోగంలో మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగం పూర్తికాలేదని, కొద్దిసేపటి తరువాత పూర్తిసమాచారం ఇస్తామని ఇస్రో చైర్మన్ నారాయణ తెలిపారు.
పీఎస్ఎల్వీ మిషన్లలో వైఫల్యాలు చాలా అరుదు. 1993లో ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని సంఘటనలు మాత్రమే జరిగాయి. గతంలో వైఫల్యాలు ఎక్కువగా దశ విభజన లేదా ప్రొపల్షన్ క్రమరాహిత్యాల సమయంలో సమస్యలు తలెత్తాయి. ఉదాహరణకు కంట్రోలింగ్ లో నియంత్రణ లేకపోవటం, నిర్దిష్ట దశ పనితీరు సరిగాలేకపోవటం వంటివి.
1993 తొలి ప్రయోగంలో ప్రోగ్రామింగ్ లోపం, రెట్రో రాకెట్ పనిచేయకపోవటం వల్ల రెండవ నుంచి మూడో దశకు వెళ్లే క్రమంలో నియంత్రణ కోల్పోవడం వల్ల మిషన్ వైఫల్యం చెందింది.
2017లో ప్రయోగం సమయంలో పెలోడ్ ఫెయిరింగ్ వేరు కాకపోవటం వల్ల మిషన్ ఫెయిల్ అయింది. పెలోడ్ ఫెయిరింగ్ సమస్య కారణంగా శాటిలైట్ రాకెట్ లోపల చిక్కుకుపోయింది.
తాజాగా.. పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగం ఫెయిల్ కావడానికి ప్రధాన కారణాల్లో.. ప్రొపల్షన్ వ్యవస్థలోని లోపాలు, దశల విభజన సమయంలో లోపాలు లేదా మార్గదర్శకత్వం, నియంత్రణ వ్యవస్థలో పనిచేయకపోవటం వంటి వివిధ అంశాలు ఉండొచ్చు. ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి, దిద్దుబాటు చర్యలను అమలు చేయడానికి టెలిమెట్రి, విమాన డేటాను కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని అంతరిక్ష సంస్థ ప్రకటించింది.