PT Usha Chairs Rajya Sabha: దిగ్గజ క్రీడాకారిణి పిలావుల్లకండి తెక్కెపరంబిల్ ఉష అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ పీటీ ఉష(PT Usha) అంటే అందరూ గుర్తుపడతారు. భారత మహిళా దిగ్గజ అథ్లెట్ అయిన ఆమె జీవితంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. గురువారం రాజ్యసభ(Rajya Sabha)లో చైర్మన్ స్థానంలో కూర్చుని కొద్దిసేపు సభా కార్యక్రమాలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ గైర్హాజరీతో ఆమెకు ఈ అవకాశం దక్కింది.
తనకు దక్కిన అరుదైన అవకాశం గురించి ట్విటర్ లో పీటీ ఉష పంచుకున్నారు. రాజ్యసభ చైర్మన్ లో కూర్చుని సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘అత్యున్నత అధికారం గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంద’ని ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ చెప్పిన మాటలు.. నేను రాజ్యసభ సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడు నాకు గుర్తుకు వచ్చాయి. నా ప్రజలు నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతో నేను ఈ ప్రయాణంలో మైలురాళ్లను అందుకుంటానని ఆశిస్తున్నాన’ని పీటీ ఉష ట్వీట్ చేశారు.
పీటీ ఉష ట్వీట్ చూసిన ఆమె మద్దతుదారులు, ఫాలోవర్లు అభిమానులు చెబుతున్నారు. ‘మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. మీ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. ముందుకు సాగుతూ మరోసారి చరిత్ర సృష్టించండి. నిజమైన సాధికారత!! ఆల్ ది బెస్ట్ మరియు కచ్చితంగా మీరు దేశానికి చాలా ఎక్కువ తిరిగి ఇస్తారు మేడమ్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నద్దా
రాజ్యసభ వైస్ చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో గత డిసెంబరులో పీటీ ఉషకు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి నామినేటెడ్ ఎంపీగా ఆమె నిలిచారు. రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు సభా కార్యకలాపాలను నిర్వహించేందుకు వైస్ చైర్‌పర్సన్‌ల ప్యానెల్ ను నియమిస్తారు.