Farmer Protesting Near Delhi Border Dies నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 22రోజూ కొనసాగుతున్నాయి. అయితే,ఢిల్లీ-హర్యాణా సింఘూ సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల్లో ఇవాళ(డిసెంబర్-17,2020) మరొకరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన రైతుని పంజాబ్ కి చెందిన భీమ్ సింగ్(37)గా గుర్తించారు. గడ్డకట్టే చలి కారణంగానే ఆ రైతు ప్రాణాలు కోల్పోయాడని సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు.
భీమ్ సింగ్ కి 10,12,14ఏళ్ల వయస్సున్న ముగ్గురు పిల్లలున్నారు. విపరీతమైన చలిని తట్టుకోలేకనే భీమ్ సింగ్ చనిపోయినట్లు రిపోర్టులు తెలిపాయి. మరోవైపు,బుదవారం కూడా ఢిల్లీ- సింఘూ సరిహద్దులో హర్యాణాకి చెందిన సిక్కు మత ప్రచారకర్త బాబా రామ్ సింగ్(65) తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆందోళన చేస్తోన్న రైతులకు సంఘీభావం తెలుపుతూ చనిపోతున్నట్లు ఆయన సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు.
కాగా, నవంబర్ చివరివారంలో రైతుల ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 20మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని రైతు సంఘాలు తెలిపాయి. ఉత్తరభారతాన్ని వణికిస్తున్న చల్లగాలులు,విపరీతమైన చలి కారణంగానే చాలా మంది అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
మరోవైపు, ఢిల్లీకి దగ్గర్లోని పలు హైవేలపై పలు ప్రాంతాల్లో కొన్ని 22 రోజులుగా ఆందోళ చేస్తున్న రైతుల వద్దరకు పలువురు వాలంటీర్లు వెళలి వారికి బ్లాంకెట్లు లేదా దుప్పట్లు మరియు హీటర్లు అందిస్తున్నారు. అదేవిధంగా, అక్కడక్కడా ఆందోళనకారులు వెచ్చదనం కోసం చలిమంటలు వేసుకుంటున్నారు. తాము చలి వతావరణంలో పోరాడుతున్నామని..తమ డిమాండ్లు నెరవేరేవరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని,వర్షం పడినా కూడా తాము తమ ఆందోళన ఆపబోమని సింఘూ బోర్డర్ లోని ఓ రైతు తెలిపారు.
అయితే, తాము చట్టాలను ఉపసంహరించుకోమని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. సాగు చట్టాల్లో సంస్కరణలతో దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొందని, ఢిల్లీ సరిహద్దులో చేస్తోన్న రైతుల నిరసనలు మాత్రం అందుకు మినహాయింపని కేంద్ర వ్యవసాయమంత్రి తోమర్ అన్నారు. రైతుల నిరసనలు ఒక రాష్ట్రానికే పరిమితమైనవి చెప్పారు. రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్న క్రమంలో త్వరగా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. బుధవారం అసోచామ్ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రైతుల ఆందోళనలపై తోమర్ ఈమేరకు స్పందించారు.
మరోవైపు, రైతుల ఆందోళనలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతులు ఆందోళన కొనసాగించవచ్చునని సుప్రీం స్పష్టం చేసింది. రైతులకు నిరసన తెలిపే హక్కుందని ధర్మాసనం పేర్కొంది. కానీ, రోడ్లు, నగరాలను దిగ్బంధించకండని కోర్టు రైతు ఆందోళనకారులకు సూచించింది. ఇతరుల హక్కులకు భంగం కలిగేలా ఆందోళన ఉండకూడదని తెలిపింది. ఆందోళనలు విధ్వంసంగా మారకుండా రైతులు చూసుకోవాలని సుప్రీం సూచనలు చేసింది. సమస్య పరిష్కారానికి కమిటి ఏర్పాటు ఒక్కటే మార్గమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.