Punjab New AAP Cabinet : కొలువుదీరిన పంజాబ్‌ కొత్త మంత్రివర్గం.. 10 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

Punjab New AAP Cabinet : పంజాబ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు శనివారం (మార్చి 19) ప్రమాణస్వీకారం చేశారు.

Punjab's New Aap Government Ten Aap Mlas Inducted Into Bhagwant Mann Led Cabinet In Punjab

Punjab New AAP Cabinet : పంజాబ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు శనివారం (మార్చి 19) ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్‌లోని రాజ్ భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆప్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళ సహా 10 మంది కేబినెట్ మంత్రుల్లో 8 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా పంజాబీలో ప్రమాణం చేశారు. పంజాబ్ కొత్త కేబినెట్ మంత్రుల్లో హర్పాల్ సింగ్ చీమా, హర్భజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మీత్ సింగ్ మీత్ హేయర్, కుల్దీప్ సింగ్ ధలీవాల్, లల్జిత్ సింగ్ భుల్లర్, బ్రామ్ శంకర్ జింపా, హర్జోత్ సింగ్ బెయిన్స్‌ ఉన్నారు. వీరిలో ఏకైక మహిళ డాక్టర్ బల్జీత్ కౌర్‌ మంత్రిగా ప్రమాణం చేశారు.

పంజాబ్ అసెంబ్లీ సభాపతిగా కుల్తార్‌సింగ్ సంధ్‌వాన్‌ను నామినేట్ చేయాలని ఆప్‌ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు కైవసం చేసుకుని ఆమ్​ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్​ కాకుండా తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్-బహుజన్ సమాజ్ పార్టీ కూటమితో BJP-పంజాబ్ లోక్ కాంగ్రెస్-SAD (సంయుక్త్) కూటమిని చిత్తు చేసింది. పంజాబ్ కొత్త కేబినెట్‌లో సీఎం సహా 18 స్థానాలు ఉన్నాయి. ఇటీవలే స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం చేశారు.

పంజాబ్‌లో మొదటి నుంచి అవినీతి రహిత పాలన అందిస్తామని ఆప్ హమీలు ఇచ్చింది. అదే దిశగా ఆప్ అడుగులు వేసింది. అత్యంత నిజాయితీ గల ప్రభుత్వంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పేరు తెచ్చుకుంటుందని మాన్ ట్వీట్ చేశారు. తన మంత్రి వర్గ కూర్పులో అన్ని వృత్తుల శాసన సభ్యులకు అవకాశం కల్పించినట్టు ఆయన చెప్పారు. ఇద్దరు వ్యవసాయదారులు, ముగ్గురు లాయర్లు, ఇద్దరు డాక్టర్లు, ఒక సామాజిక కార్యకర్త, ఒక ఇంజనీర్, ఒక వ్యాపారవేత్తకు కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించారు.

కేబినెట్ మంత్రులుగా ఎంపికైన ఎమ్మెల్యేలు పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 10 మందిలో ఐదుగురు మాల్వా ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. మరో నలుగురు మజాకు చెందినవారు కాగా.. ఒకరు దోబా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగిలిన 7 ఖాళీలను రెండోసారి మంత్రివర్గ విస్తరణలో భర్తీ చేసే అవకాశం ఉంది.

Read Also : Bhagwant Mann : పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం