ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక భాగం కాదా? ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయరా? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక భాగం కాదా? ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయరా? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తెలుగుదేశం పార్టీ ఢిల్లీ వేదికగా చేపట్టిన సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు హాజరయిన రాహుల్.. ఆవేశంగా మాట్లాడారు. చంద్రబాబు దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధాని మోడీ వైఖరిని తప్పుబట్టారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ఎందుకు మాట మార్చిందని నిలదీశారు. ఆంధ్ర ప్రజల కోసం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మోడీ ఎక్కడకి వెళ్లినా అబద్దాలు చెబుతున్నారని.. ఏపీలో కూడా ఇలాగే చెప్పారని విమర్శించారు. చౌకీదార్.. చోర్ హై.. అంటూ అభివర్ణించారు. ఆంధ్ర ప్రజల డబ్బును దోచుకుని అనీల్ అంబానీకి కట్టబెట్టారని విమర్శలు చేశారు రాహుల్ గాంధీ.
ఢిల్లీలో ఏపీ భవన్ దగ్గర ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఒక రోజు ఈ నిరాహార దీక్షకు మద్దతు ప్రకటిస్తూ వచ్చిన రాహుల్ గాంధీ.. వేదికపై చాలాసేపు కూర్చుకున్నారు. చంద్రబాబు పక్కనే కూర్చుని.. సీఎంతో చాలాసేపు ముచ్చటించారు. ఏపీతోపాటు జాతీయ రాజకీయాలపై కూడా చంద్రబాబు – రాహుల్ చర్చించుకున్నారు. వీరిద్దరూ వేదికపై అలా మాట్లాడుకోవటం చూసిన టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
టీడీపీ – కాంగ్రెస్ దోస్తీతో వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయం అంటున్నారు టీడీపీనేతలు. వేదికపై ఉన్న అంబేద్కర్, ఎన్టీఆర్ చిత్ర పటాలకు కూడా రాహుల్ గాంధీ నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.చంద్రబాబు – రాహుల్ గాంధీ వేదికపై మాట్లాడుకోవటం దేశరాజకీయాల్లోనే కొత్త చరిత్రకు నాంది అంటున్నారు టీడీపీ కార్యకర్తలు, నేతలు.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మోడీ పబ్లిసిటీ : ఆర్జీవీ ట్వీట్
Read Also : బీజేపీ వల్లే తెలంగాణ వచ్చింది : బాబు దీక్షలో ఆమ్ ఆద్మీ కీలక వ్యాఖ్యలు