Rahul Gandhi
Rahul Gandhi: పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే భయమని, సత్యానికి కూడా జంకుతారని విమర్శించారు. వీటికి ప్రతిరూపమే ప్రధాని మోదీ ప్రసంగమని రాహుల్ ఎద్దేవా చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు అసలు జవాబే ఇవ్వలేదని, చైనా – పాక్ సంబంధాలు, భారత్‌లోనే రెండు దేశాలు, రాజ్యాంగం గురించిన మూడు అంశాలను లోక్‌సభలో లేవనెత్తానని వివరించారు.
‘లోక్ సభ వేదికగా ప్రధాని మేం అడిగిన ప్రశ్నలకు జవాబే ఇవ్వలేదు. పాక్, చైనా విషయాన్ని చాలా సీరియస్‌గా లేవనెత్తాం. అలా మాట్లాడాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మా కుటుంబమంతా దేశానికి సేవ చేసింది. ఇతరులు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు’ అని రాహుల్ తేల్చి చెప్పారు.
చైనా, పాక్ దగ్గరైన విషయంలో కూడా తాను హెచ్చరిస్తున్నానని, ఈ రెండు దేశాలు దగ్గరైతే, భారత్‌కు ప్రమాదమేనని రాహుల్ మరోసారి హెచ్చరించారు. విదేశాంగ విధానం అనుసరిస్తున్న మోదీ పద్ధతి సరైంది కాదని సూచించారు.
Read Also: ధైర్యంగా థియేటర్లకి ఖిలాడీ.. మాస్ రాజాకి ఇంత నమ్మకమేంటి?
కొవిడ్ విషయంలో అనవసరంగా నిందిస్తున్నారని, అప్పట్లోనే కొవిడ్ కేసుల విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరించామని, తమ మాటలను, హెచ్చరికలను పెడచెవిన పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉభయ సభల్లోనూ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విధి విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
మరో 100 సంవత్సరాలైనా.. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, అందుకు కూడా తాము రంగం సిద్ధం చేస్తున్నామని అన్నారు.