Rahul Gandhi In Srinagar : భారత్ ను విభజించే మోదీ సిద్ధాతంపైనే నా పోరాటం.. నాలో కూడా కశ్మీరీ లక్షణాలున్నాయ్

ఆర్టికల్‌ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్ లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

Rahul

Rahul Gandhi In Srinagar ఆర్టికల్‌ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్ లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కరోనా సమయంలోనే తాను కశ్మీర్ కి రావాలనుకున్నానని.. కానీ తనను ప్రభుత్వం అనుమతించలేదన్నారు. ఈ రోజు తమ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోందని.. కానీ, గతంలో తమ కుటుంబం కశ్మీర్​లోనే ఉండేదని రాహుల్ అన్నారు తమ కుటుంబం సైతం జీలమ్​ నది నీటిని తాగిందని.తనలో కూడా కశ్మీరీ లక్షణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తనకు సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తోందని.. త్వరలోనే జమ్ము, లడఖ్ కి వెళ్తానని రాహుల్ అన్నారు.

ఈ సందర్భంగా మోదీ సర్కార్ పై రాహుల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి జమ్ముకశ్మీర్​పై దాడి జరుగుతోందని రాహుల్​ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రం.. జమ్ముకశ్మీర్​పైనే దాడి చేయటం లేదని, తమిళనాడు, వెస్ట్ బెంగాల్​ సహా ఇతర రాష్ట్రాలపైనా దాడికి పాల్పడుతోందన్నారు. అయితే ఇతర రాష్ట్రాలు పరోక్షంగా ప్రభావితమైతే.. జమ్ముకశ్మీర్​ నేరుగా ఢిల్లీ నుంచి దాడికి గురవుతోందన్నారు. జమ్ముకశ్మీర్​పై కాంగ్రెస్​ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని రాహుల్ డిమాండ్​ చేశారు. అప్పుడే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్నారు.

నరేంద్రమోదీ విభజించే సిద్ధాతం,భారత్ ను విడదీసే ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా తన పొరాటం కొనసాగుతూనే ఉంటుందని రాహుల్ తెలిపారు. తన ఫైట్ కేవలం ప్రధానితో తప్ప మరెవ్వరితో కాదని రాహుల్ తెలిపారు. తాను ద్వేషం,భయానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిని అని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్-ఇతర పార్టీల మధ్య ఉన్న తేడా ఏంటంటే కాంగ్రెస్ ఎవ్వరినీ ద్వేషించదు మరియు తాము హింసను నమ్మకోమని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక శాంతి,ప్రేమ యొక్క ఆర్మీ అని తెలిపారు.

రైతు చట్టాలు,పెగాసస్ స్నూపింగ్,నిరుద్యోగం,అవినీతి,రాఫెల్ డీల్ వంటి ముఖ్యమైన అంశాలను పార్లమెంట్ ప్రస్తావించనీయకుండా విపక్షాలను కేంద్రం అడ్డుకుంటుందని రాహుల్ ఆరోపించారు. న్యాయవ్యవస్థ, లోక్​సభ సహా మీడియా నోరును బీజేపీ నొక్కుతోందని మండిపడ్డారు రాహుల్.

కాగా,రెండు రోజుల కశ్మీర్ పర్యటన కోసం సోమవారం సాయంత్రం శ్రీనగర్ చేరుకున్న రాహుల్ గాంధీ..ఇవాళ ఉదయం గందెర్బాల్​లోని కశ్మీరీ పండిత్​ల ఆరాధ్య దైవం మాతా ఖీర్​ భవానీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీనగర్ లోని హ‌జ్ర‌త్‌బ‌ల్ మ‌సీదును సందర్శించి చాదర్‌ సమర్పించారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత షేక్‌ హంజా మఖ్దూం సమాధితోపాటు గురుద్వారాను కూడా రాహుల్ సందర్శించారు.