Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఆదివారం తెలంగాణలో ప్రవేశించనుంది. కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్ పోస్టు వద్ద ఉదయం 10గంటలకు రాహుల్ గాంధీ రాష్ట్రంలో అడుగుపెడతారు. తెలంగాణలో తొలిరోజు సుమారు మూడు కిలో మీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో టైరోడ్డులో యాత్ర ముగించి రాహుల్ ఢిల్లీకి వెళ్తారు.
భారత్ జోడో యాత్ర తెలంగాణలో మొత్తం 12 రోజులు 375 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. నవంబర్ 7వ తేదీన కామారెడ్డిజిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని శాఖాపూర్ లో రాష్ట్రంలో యాత్ర ముగుస్తుంది. రాహుల్ రోజుకు 20 నుంచి 25 కిలో మీటర్ల మేర ప్రజలతో మమేకమవుతూ యాత్రలో పాల్గొంటారు. పలు ప్రధాన ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు.
Bharat Jodo Yatra
భారత్ జోడోయాత్ర తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఏడు జిల్లాలు, ఏడు లోక్ సభ నియోజకవర్గాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. నారాయణపేట జిల్లాలో ఎంట్రీ అయ్యే యాత్ర.. మహబూబ్ నగర్ జిల్లా మీదుగా రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొనసాగుతుంది. రాహుల్ గాంధీ యాత్రకు విజయవంతం చేసేందుకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
ఇదిలాఉంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మూడు రోజులు విరామం ఇవ్వనున్నారు. 23న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన కొద్దిసేపటికి యాత్రను ముగించి రాహుల్ ఢిల్లీ వెళ్తారు. 24, 25, 26 తేదీల్లో దీపావళి నేపథ్యంలో యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. 25న ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. తిరిగి ఈనెల 27వ తేదీ నుంచి నవంబర్ 7వరకు తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది.