RAC టికెట్లపై రైల్వే శాఖ సంచలనం.. ఇక నుంచి..
RAC Ticket Cancellation : RAC టికెట్ల విధానానికి భారతీయ రైల్వే స్వస్తి పలకనుందా? సగం బెర్త్‌కు పూర్తి ఛార్జీ వసూలు చేయడంపై వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఆర్ఏసీ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- November 13, 2026 / 03:13 PM IST
RAC Ticket Cancellation
- ఆర్ఏసీ విధానానికి రైల్వే గుడ్‌బై?
- ప్రయాణికులకు త్వరలో కొత్త రూల్స్
- రైల్వేలో దశాబ్దాల నాటి రూల్‌కు ముగింపు?
RAC Ticket Cancellation : రైలు ప్రయాణం చేసే వారికి (RAC) టికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ప్రయాణించే అవకాశం ఉండటంతో చాలామంది RAC టికెట్లపై ఆధారపడుతుంటారు. అయితే, ఇదే ఆర్ఏసీ విధానానికి త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈ పద్ధతిని పూర్తిగా తొలగించే అంశంపై భారతీయ రైల్వే అధికారులు పరిశీలన చేస్తున్నారు..
అసలు RAC విధానం ఎందుకు వచ్చింది? :
గతంలో రైల్వే టికెట్ల రిజర్వేషన్లు ఎక్కువగా మాన్యువల్ పద్ధతిలో జరిగేవి.. ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఖాళీ అయ్యే బెర్తులను ఎప్పటికప్పుడు గుర్తించడం అంత ఈజీ కాదు. దీంతో ఒకే బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు కేటాయించేలా ఆర్ఏసీ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇద్దరూ ప్రయాణించవచ్చు. ఒకవేళ మరో ప్రయాణికుడు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే, మిగిలిన వారికి పూర్తి బెర్త్ దక్కే అవకాశం ఉంటుంది..
సగం బెర్త్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు? :
ఆర్ఏసీ విధానంపై ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అభ్యంతరం ఇదే.. ఇద్దరు ప్రయాణికులు ఒకే బెర్త్‌ను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ, ఇద్దరి దగ్గర నుంచి పూర్తి టికెట్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. డబ్బులు పూర్తిగా చెల్లించినా, నిద్రించడానికి మాత్రం సగం స్థలమే ఉండటంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఒకే సీటును మహిళ, పురుష ప్రయాణికులకు కేటాయించినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ బెర్తులు అడ్జెస్ట్ చేయడం టికెట్ చెకింగ్ చేసే సిబ్బందికి కూడా సవాలుగా మారుతోంది. ఈ అంశాన్ని పార్లమెంటరీ కమిటీ కూడా ప్రస్తావించింది.
ఫుల్ బెర్త్ సౌకర్యం కల్పించకుండా పూర్తి ఛార్జీ వసూలు చేయడంపై పునఃపరిశీలన చేయాలని సూచించింది. అయితే, ఆర్ఏసీ విధానాన్ని రద్దు చేస్తారా? లేక ఛార్జీల్లో మార్పులు చేస్తారా? అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రైల్వే నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రయాణికులు వేచి చూడాల్సిందే..
