Sonia Gandhi : షాబానో కేసు సమయంలో రాజీవ్‌ను నిలదీసిన సోనియా.. అప్పుడేం జరిగిందంటే..? ఆత్మకథలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Sonia Gandhi : కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తన ఆత్మకథలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షాబానో కేసు అప్పట్లో భారత దేశ రాజకీయాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సమయంలో రాజీవ్ గాంధీని గట్టిగా నిలదీసినట్లు చెప్పుకొచ్చారు.
Sonia Gandhi
Sonia Gandhi : షాబానో కేసు అప్పట్లో భారత దేశ రాజకీయాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వ్యవహారంపై అప్పటి ప్రధానమంత్రి, తన భర్త రాజీవ్ గాంధీని తాను ప్రశ్నించిన విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తాజాగా వెల్లడించారు. అందుకు సంబంధించిన విషయాలను తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో గుర్తు చేసుకున్నారు. ముస్లిం మహిళల హక్కులను ప్రభుత్వం పణంగా పెడుతోందంటూ పత్రికల్లో వస్తున్న కథనాలు తనను కలవరపరిచాయని, దీనిపై రాజీవ్ గాంధీని నేరుగా నిలదీశానని ఆమె రాసుకున్నారు.
1985లో షాబానో అనే ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం (నెలవారీ ఖర్చుల కోసం ఇచ్చే డబ్బు) పొందేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భర్త మరో పెళ్లి చేసుకుని ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించడంతో తనకు, తన పిల్లలకు జీవనభృతి కల్పించాలని కోరారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు షాబానోకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమెకు భరణం చెల్లించాలని భర్తను ఆదేశించింది. అయితే, ఈ తీర్పును ముస్లిం వ్యక్తిగత చట్టం ఆధారంగా సవాలు చేయడంతో వివాదం మొదలైంది. ఈ అంశంపై పత్రికలు, మ్యాగజైన్లలో వచ్చిన కథనాలు చదివిన సోనియా గాంధీ ఆందోళనకు గురయ్యారు. మహిళా హక్కుల కోసం పోరాడుతున్న పలువురు కార్యకర్తలు కూడా షాబానోకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాలపై సోనియా గాంధీ తన భర్త రాజీవ్ గాంధీతో మాట్లాడారు. ముస్లిం మహిళల ప్రయోజనాలను ప్రభుత్వం పణంగా పెడుతోందని పత్రికలు విమర్శిస్తున్నాయని, అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు.
దీనికి రాజీవ్ గాంధీ స్పందిస్తూ.. క్లిష్టమైన పరిస్థితిని న్యాయంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పినట్లు సోనియా తన పుస్తకంలో వెల్లడించారు. మహిళల హక్కులను కాపాడకుండా ఉంటానా? తన గురించి తనకు తెలియదా? అంటూ సమాధానమిచ్చారని గుర్తుచేసుకున్నారు. ముస్లిం వ్యక్తిగత చట్టాల వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా షాబానోతో పాటు ఆమెలాంటి ఇతర మహిళలకు న్యాయం జరిగే మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు రాజీవ్ వివరించారని సోనియా రాసుకొచ్చారు.
ఈ వ్యవహారంలో రాజీవ్ గాంధీ అంగీకరించిన రాజీ మార్గం మత విశ్వాసాలు, మహిళల హక్కుల మధ్య సమతుల్యత సాధించేందుకు ప్రయత్నించిందని సోనియా అభిప్రాయపడ్డారు. కోర్టు షాబానోకు నిర్ణయించిన నెలకు రూ.179.20 భరణం కంటే మెరుగైన ఆర్థిక ప్రయోజనం ముస్లిం మహిళలకు లభించేలా ఆ పరిష్కారం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పును ప్రభావితం చేసిన 1986 నాటి చట్ట సవరణ రాజకీయంగా విమర్శలకు దారితీసిందని కూడా అంగీకరించారు. బీజేపీ దీనిని ఓటు బ్యాంకు రాజకీయాలుగా విమర్శించగా, ప్రగతిశీల వర్గాలు ముస్లిం సమాజంలోని సంప్రదాయవాదుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని అభిప్రాయపడ్డాయని తన పుస్తకంలో వివరించారు.
