CM Ashok Gehlot : ఆవు పేడ కొంటాం, ఇచ్చిన హామీలు అమలు చేస్తాం : సీఎం ప్రకటన

ఐదు రాష్ట్రాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునే మ్యానిఫెస్టోని సిద్దం చేస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రకటించిన కొన్ని హామీలను వెల్లడించారు.

Rajasthan

Rajasthan elections 2023 CM Ashok Gehlot : ఐదు రాష్ట్రాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది.దీని కోసం ఓటర్లను ఆకట్టుకునే మ్యానిఫెస్టోని సిద్దం చేస్తోంది. దీంట్లో భాగంగా కొన్ని హామీలను శుక్రవారం జైపూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

గోధన పథకం కింద ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అలాగే గృహ లక్ష్మి గ్యారెంటీ పథకం కింద ఒక్కో కుటుంబంలో ఓ మహిళకు సంవత్సరానికి రూ. 10,000లు నగదు వంటివి ప్రకటించారు. స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడతామని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన వారికి రూ.15 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు.కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ లేదా టాబ్లెట్‌ పీసీ పంపిణీ వంటి ఏడు హామీలను ప్రకటించారు. తాము మరోసారి అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేస్తామని  అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే ఇస్తున్న పింఛన్ విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామన్నారు. వీటితో పాటు కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటివి ఇప్పటికే ప్రియాంకా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా..రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పటికే రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల బీమా పథకం, రాష్ట్రంలో ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఆరోగ్య బీమాను అందజేస్తోంది.