Rajasthan Minister Bhanwar Lal Meghwal Passes Away కాంగ్రెస్ సీనియర్ లీడర్,రాజస్తాన్ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్(72) సోమవారం కన్నుమూశారు. గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ఈ ఏడాది మే నెలలో హాస్పిటల్ లో చేరిన ఆయన గత ఆరు నెలలుగా ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ చనిపోయారు.
భన్వర్ లాల్ మేఘవాల్ మృతి పట్ట రాజస్తాన్ సీఎం,ప్రధానమంత్రి సహా నాయకులు ప్రముఖులు సంతాపం తెలిపారు. తన సహచరుడు భన్వర్ లాల్ మరణవార్త తనకు చాలా బాధ కలిగించిందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. తామిద్దరం 1980నుంచి కలిసి ఉన్న విషయాన్ని గెహ్లాట్ గుర్తుచేశారు. ఈ సమయంలో భన్వర్ లాల్ కుటుంబ సభ్యులకు తన ప్రాగఢ సానుభూతి తెలియజేస్తున్నానని గెహ్లాట్ తెలిపారు. భన్వర్ లాల్ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు గెహ్లాట్ తెలిపారు.
భన్వర్ లాల్ మరణం బాధ కలిగించిందని,రాజస్తాన్ కి సేవ చేయాలనే తపన కలిసిన వెటరన్ లీడర్ భన్వర్ లాల్ అని,వారి కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, రాజస్తాన్ లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో భన్వర్ లాల్ కీలక పాత్ర పోషించారు. గడిచిన 4దశాబ్దాలుగా ఆయన రాజస్థాన్ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ కి ఆయన ముఖ్య మద్దతుదారుడు.