Rajasthan Political Crisis : కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

  • Publish Date - July 24, 2020 / 10:51 AM IST

రాజస్థాన్‌ రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. సుప్రీంకోర్టులో పైలట్‌ వర్గానికి ఊరట లభించింది. రాజస్థాన్‌ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైలట్‌ అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టు 2020, జులై 24వ తేదీ శుక్రవారం తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

హైకోర్టు ఆదేశాల అమలు మాత్రం సుప్రీంకోర్టులో వచ్చే ఫలితంపై ఆధారపడి ఉండాలన్నారు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా. సుప్రీంకోర్టులో స్పీకర్‌ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. స్పీకర్‌ నిర్ణయం తీసుకోకుండా ఆపడమన్నది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని స్పీకర్‌ సీపీ జోషి తరపు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదించారు.

దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 27కి వాయిదా వేసింది. పైలట్‌ వర్గంపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదంటూ రాజస్థాన్‌ హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ స్పీకర్‌ సీపీ జోషి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సీఎల్పీ సమావేశాలకు హాజరుకాకపోవడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ వేటువేసింది. పీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం పదవుల నుంచి పైలట్‌ను తప్పించింది. సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ అనర్హత నోటీసులు పంపించారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌ను కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు సచిన్ పైలట్. పైలట్‌ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. జూలై 24 వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌కు సూచించింది.