రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరూ ఊహించలేం అని, ఏదైనా సాధ్యం అని అన్నారు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్. సీఎం అయ్యేందుకు ఏళ్లతరబడి కలలు కనక్కరలేదు.. సీఎం కావాలని ఏనాడైనా ఎడపాడి పళని స్వామి కలలు కన్నారా? ఆయన అయ్యనట్లే రేపు ఎవరైనా సీఎం కావచ్చు అంటూ సూటిగా పేరుపెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్.
తమిళనాడు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయని, జయలలిత హఠాన్మరణం కారణంగా అన్నాడీఎంకేలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు రజినీకాంత్. శశికళ జైలుకు వెళ్లడంతో గుర్తింపులేని ఎడపాడి పళనిస్వామి అకస్మాత్తుగా సీఎం అయ్యారని రజినీకాంత్ అన్నారు.
వాస్తవానికి తమిళనాడులో ఏర్పడి ఉన్న ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పళని ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు లేకుండా తమిళనాడు రాజకీయాల్లో సాగుతుంది. ఈ క్రమంలోనే కమల్ హాసన్, రజినీకాంత్ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసినా కూడా పార్టీ పెట్టలేదు. కమల్ మాత్రం మక్కల్ నీది కయ్యం పార్టీ స్థాపించారు.