OC రిజర్వేషన్లకు పార్లమెంటు ఆమోదం

  • Publish Date - January 9, 2019 / 04:44 PM IST

కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చరిత్రాత్మక ఓసీ రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘమైన చర్చ తర్వాత డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ డివిజన్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించారు. బిల్లుకి అనుకూలంగా 165 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 7 ఓట్లు పడ్డాయి. మొత్తం 172మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఉభయసభల్లో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకి ఆమోదం లభించింది. దీంతో అగ్రకులాల్లో ఆర్ధికంగా వెనుబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు.

విపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా చివరకు సరేనన్నాయి. రాజకీయంగా కీలకమైన అంశానికి పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది. బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని మించిన మద్దతును ప్రభుత్వం కూడగట్టగలిగింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 18మంది సభ్యులు, వ్యతిరేకంగా 155 మంది సభ్యులు ఓటు వేశారు. చరిత్రాత్మక బిల్లులో భాగస్వాములైనందుకు అందరికీ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా సంచలన నిర్ణయం తీసుకుంది. హఠాత్తుగా ఈ ప్రతిపాదన తీసుకురావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ రాజకీయ లబ్ది కోసమే మోదీ ఈ బిల్లు తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపించాయి. ఇది ఎలక్షన్ స్టంట్ అని మండిపడ్డాయి. కీలకమైన బిల్లుని ఇంత హడావుడిగా ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించాయి. ఎలాంటి డేటా సేకరించకుండా, ఎలాంటి కసరత్తు చేయకుండా ఓసీ రిజర్వేషన్ల బిల్లు ఎలా తీసుకొస్తారని కాంగ్రెస్ మండిపడింది. బిల్లు తీసుకొచ్చిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కీలక బిల్లు కావడంతో విపక్షాలన్నీ ఓసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వక తప్పలేదు.

* ఈబీసీ రిజర్వేషన్లకు పార్లమెంటు ఆమోదం
* 124వ రాజ్యాంగ సవరణకు రాజ్యసభ ఆమోదం
* ఈబీసీలకు రిజర్వేషన్ల కోసం ఆర్టికల్ 15, 16కి సవరణలు
* ఆర్టికల్ 15కి క్లాజ్(6), 16కి క్లాజ్(6) ను చేర్చిన కేంద్రం
* చట్టబద్ధత కోసం ఆర్టికల్ 15, 16లకు అదనపు క్లాజ్‌లు జోడించిన కేంద్రం
* కులాలు, మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు
* వీగిపోయిన విపక్షాల సవరణలు
* బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలన్న సవరణ తిరస్కరణ
* ప్రైవేట్ సెక్టార్‌లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్న సవరణకు తిరస్కారం