మేకుల ఉచ్చులపై పడుకుంటా – రాకేశ్ టికాయత్, దద్దరిల్లుతున్న పార్లమెంట్

Rakesh Tikait’s “Gaddi Wapsi” Warning : రెండున్నర నెలలుగా ఉద్యమిస్తున్న రైతు ఉద్యమనేత టికాయ్‌..కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనన్నారు. అటు పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లాయి. రాజ్యసభలో మొదలైన సుదీర్ఘ చర్చ 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం కూడా కొనసాగనుంది. రైతు ఉద్యమ కారుల స్వరం మారింది. బీకేయూ జాతీయ కార్యదర్శి రాకేశ్‌ టికాయత్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు. చట్టాల రద్దు చేయకపోతే.. అధికారం కోల్పోవాల్సి వస్తుందని నరేంద్ర మోదీని పరోక్షంగా హెచ్చరించారు. ఇన్నాళ్లూ చట్టాల వాపస్‌ గురించి మాట్లాడితే వినలేదు… ఇపుడు చెబుతున్నా .. జాగ్రత్తగా వినండి… గద్దీ వాప్సీ డిమాండ్‌ చేస్తే మీరేం బదులిస్తారు..? అని ఆయన హరియాణలోని జింద్‌లో జరిగిన రైతు మహాపంచాయతీలో కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

ఢిల్లీ సరిహద్దుల్లో ఆంక్షలు విధించడాన్ని టికాయత్‌ తీవ్రంగా నిరసించారు. రాజు భయపడ్డపుడే కోట చుట్టూ భద్రత పెంచుతాడు.. కోటను అట్టేపెట్టుకుంటాడు.. పోలీసులు పరిచిన మేకుల ఉచ్చులపై నేనే పడుకుంటా.. నాపై నుంచే అందరూ నడిచివెళ్లవచ్చు అని ఆయన ఉద్వేగంగా అన్నారు. ఇటు పార్లమెంట్‌ ఉభయసభలూ విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లాయి. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా విపక్ష ఎంపీలు లోక్‌సభలో గళమెత్తారు. బుధవారం స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులకు ఎంత నచ్చచెప్పినా వినకపోడంతో వాయిదాల పర్వమే కొనసాగింది. సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన సభా కార్యకలాపాలకు విపక్ష ఎంపీలు అడ్డుతగిలి వెల్‌లోకి దూసుకెళ్లారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోస్టర్‌ను ప్రదర్శించారు. తొలుత 4.30 గంటలకు, ఆ తర్వాత 5గంటల వరకు.. ఇలా పలుమార్లు సభ వాయిదా పడింది. చివరకు రాత్రి 9గంటలకు మరోసారి కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను స్పీకర్‌ నేటికి వాయిదా వేశారు.

రాజ్యసభలో ముగ్గురు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై రాజ్యసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరినా గందరగోళం కొనసాగింది. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్ చేశారు. రెండున్నర నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన అంశంపై ఎగువసభలో గురువారం సుదీర్ఘ చర్చ జరగనుంది. రైతుల అంశంపై చర్చకు అదనపు సమయం కేటాయించడంతో ప్రశ్నోత్తరాల గంటను, శూన్య గంటను ఎత్తివేయనున్నారు. శుక్రవారం బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ, ప్రైవేటు మెంబర్‌ బిల్లు సమయాలను కూడా చర్చకే వినియోగించనున్నట్లు చెప్పారు.