లాక్ డౌన్ : రోగుల పెరుగుదల నిష్పత్తిలో తగ్గుముఖం : లవ్ అగర్వాల్

  • Publish Date - March 27, 2020 / 01:23 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భూతం..భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి బారిన వందలాది మంది పడ్డారు. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ని కట్టడి చేసేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..ఒక్క రోజు జనతా కర్ఫ్యూని విధించిన కేంద్రం..ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

 

ఎవరూ కూడా బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించారు. ఈ చర్యతో రోగుల పెరుగుదల తగ్గుముఖం పట్టిందంటున్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. దేశంలో కరోనా రోగుల సంఖ్య తగ్గకపోయినా..పెరుగుదల నిష్పత్తిలో కొంత తగ్గుదల కనిపిస్తోందన్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు. 

వైరస్ సామాజికంగా మాత్రం వ్యాపించడం లేదని స్పష్టం చేశారు. నిర్ధేశించిన ఆంక్షలను యథాతథంగా అమలు చేయకపోతే చాలా ప్రమాదం ఉందని, దీనిని అమలు చేయకపోతే..సామాజిక వ్యాప్తి మొదలవుతుందన్నారు. ఇంటిలోని పెద్దవారితో కనీసం మూడు అడుగుల దూరం పాటించాలని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రమన్ ఆర్.గంగాఖేడ్కర్ వెల్లడించారు. 

మరోవైపు దేశంలో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరగుతోంది. కరోనా వైరస్ కారణంగా 16 మంది చనిపోయారు. మొత్తం 694 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక్క రోజులోనే 90 కేసులు పెరిగాయని అంచనా.