కేరళ సీఎం పిన్నరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్,కాలేజీల్లో ఉదయం ప్రార్థనా సమయాల్లో విద్యార్థులందరితో భారత రాజ్యాంగ ప్రవేశికను చదివించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. సోమవారం కోజికోడ్ లో జరిగిన విద్యార్థి నాయకుల సదస్సులో సీఎం పినరయి విజయన్ ఈ విషయాన్ని తెలిపారు.
భారత రాజ్యాంగం, దాని విలువలపై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులల్లో రాజ్యాంగ అధ్యయనాలు పాఠ్యాంశాల్లో అనివార్యమైన భాగంగా ఉండేలా చూడాలని కాలేజీ యూనియన్ లీడర్ల డిమాండ్‌కు ప్రతిస్పందనగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని విజయన్ తెలిపారు.
అంతేకాకుండా కాలేజీ యూనియన్ ఎన్నికల్లో విద్యార్థినులకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా విద్యార్థి, విద్యార్థినుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ఓపెన్ యూనివర్సిటీ లైబ్రరీలను 24 గంటలపాటు తెరిచి ఉంచేలా చర్యలు చేపడతామన్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ కూడా విద్యా పాఠ్యాంశాల్లో భాగంగా చేయబడుతుందని విజయన్ అన్నారు.