దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్‌డౌన్ 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో ముగియనుంది. అయితే ఈ లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా.. లేక ఎత్తివేస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. మంగళవారం ఉదయం పది గంటలకు ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందులో లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేయనున్నారు. దీంతో లాక్‌డౌన్ కొనసాగింపా.. లేక ఎత్తేస్తారా అన్నది తేలనుంది.
దేశంలో లాక్‌డౌన్… రాష్ట్ర ప్రభుత్వాల సమర్థత, దేశ ప్రజల సహకారంతో విజయవంతమైంది. అయితే పరిస్థితి మాత్రం ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. నేటికీ వందల సంఖ్యలో ప్రతిరోజు కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో.. లాక్‌డౌన్ ఎత్తేస్తే పెనుముప్పు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే పీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ కొనసాగించడమే మంచిదని సలహా ఇచ్చాయి.
మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్ పొడిగిస్తే కరోనా వైరస్ వ్యాప్తి మరింత కంట్రోల్‌లోకి వస్తుందని… లేదంటే ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రులు సూచించారు. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్రం కూడా లాక్‌డౌన్‌ను ఎత్తివేయకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది.
లాక్‌డౌన్ ఎత్తివేయకపోయినా.. కొన్ని కీలక రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశముంది. దేశ ప్రజల ప్రాణాలతోపాటు.. ఆర్థిక రంగం కూడా ముఖ్యమేనని తెలిపారు. ఇప్పటికే భారత్ లాక్‌డౌన్‌తో 7 నుంచి 8 లక్షల కోట్లు నష్టపోయినట్టు వివిధ సర్వేలు చెబుతున్నాయి. దీంతో మొత్తంగా 16 కీలక రంగాలకు మినహాయింపు ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఆహారం, శీతల పానీయాలు, ఆటోమొబైల్స్, స్టీల్, సిమెంట్, ప్లాస్టిక్స్, పెయింట్స్ లాంటి ఉత్పత్తుల్ని తయారు చేసే కంపెనీలకు వెసులుబాటు ఇవ్వాలని డీపీఐటీ కేంద్రాన్ని కోరింది. అలాగే వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, ఉత్పత్తుల ఎగుమతులకు మినహాయింపు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు.. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.
పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగించే ఛాన్స్ ఉంది. ఈనెల 15 నుంచి రెండో దశ లాక్ డౌన్ పొడిగిస్తే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పంటలు, ఉత్పత్తుల సేకరణకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకునే అవకాశముంది. మత్స్య పరిశ్రమ, చిన్నతరహా పరిశ్రమలు, డోర్ డెలివరీ ఉత్పత్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కార్మికులు, డ్రైవర్స్ సైతం రోజువారీ విధులు నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వనున్నారు.
లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది వలస కార్మికులు శిబిరాల్లో తలదాచుకున్నారు. వారిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేసేలా చర్యలు తీసుకోనుంది కేంద్రం. వారంతా తిరిగి ఫ్యాక్టరీలకు వెళ్లి పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. ఇందుకోసం స్పెషల్ రైళ్లు, బస్సుల్ని నడపనున్నట్లు అధికారులు చెప్తున్నారు. నిర్మాణ రంగ కార్యకలాపాలకు గ్రీన్‌సిగ్నల్‌మరోవైపు పారిశ్రామిక టౌన్‌షిప్‌లో ఉత్పత్తుల్ని తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య అవసరాలకు సంబంధించిన వైద్య పరికరాలు, టెస్టులకు ఉపయోగించే మెడికిల్ కిట్స్‌ను తయారు చేసే ఫ్యాక్టరీలు ఓపెన్ కానున్నాయి.
నిర్మాణ రంగ కార్యకలాపాలు కొనసాగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకునేలా చర్యలు తీసుకోనుంది. వైరస్ తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి.. ఆ మేరకు లాక్‌డౌన్ ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఏదేమైనా ఈ ఉదయం ప్రధాని మోదీ చేయనున్న ప్రకటన కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్‌పై ఆయన ఏం ప్రకటిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.