బీజేపీపై ఉద్దవ్ ఉరుములు : విద్యార్థులపై దాడి మరో “జలియన్ వాలాబాగ్”

పౌరసత్వ చట్టానికి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యను తప్పుబడుతున్నట్లు శివసేన తెలిపింది.

విద్యార్థులపై పోలీసుల చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. విద్యార్థులపై పోలీసుల చర్య తనకు “జలియన్ వాలాబాగ్” ఘటనను గుర్తుచేసినట్లు ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో వందలాది మంది అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న జలియన్ వాలాబాగ్ ఘటన గురించి అందరికీ తెలిసిందే.

మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్దవ్ మాట్లాడుతూ…ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించి, విద్యార్థులపై కాల్పులు జరిపిన తీరు నాకు జలియన్‌వాలా బాగ్ విషాదం గుర్తుకు వచ్చింది. విద్యార్థులను భయపెట్టడానికి ప్రయత్నించడం ద్వారా మనం ఈ దేశంలో జలియన్ వాలా బాగ్ లాంటి పరిస్థితిని సృష్టిస్తున్నామా “అని ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. మోడీ సర్కార్ పై ఈ సందర్భంగా ఉద్దవ్ విమర్శలు గుప్పించారు.

యువత కోపంగా ఉన్న దేశంలో లేదా రాష్ట్రంలో శాంతి ఉండదు. యువత మన బలం. మనం త్వరలో అత్యధిక యువత కలిగిన దేశంగా అవతరిస్తాము. యువత శక్తి బాంబు లాంటిది. దానిని మండించవద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని ముఖ్యమంత్రి తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.