జబ్ తక్ రోడ్ నహీ…తబ్ తక్ ఓట్ నహీ

Residents of Firozabad boycott assembly by-election ఉత్తరప్రదేశ్ లోని 7 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే, ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఫిరోజాబాద్ ప్రజలు ప్రకటించారు. తమ ప్రాంతం చాలా ఏళ్లుగా అభివృద్ధి నోచుకోలేదని ఫిరోజాబాద్ ప్రజలు తెలిపారు. కనీస సదుపాయాలు కూడా తమకు ప్రభుత్వం కల్పించలేదన్నారు. రోడ్ల పరిస్థితి మరీ అద్వానం అని తెలిపారు. తమ ప్రాంతంలో అభివృద్ధి జరిగేంతవరకు తాము ఎన్నికలను బాయ్ కాట్ చేయనున్నట్లు తెలిపారు.



వికాస్ నహీ తో వోట్ నహీ నినాదంతో..రుదాహు ముష్కిల్ బూత్ నెం.30 ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు. ఈ బూత్ లో 629మంది ఓటర్లు ఉన్నారు. ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కరూ కూడా అక్కడ ఓటింగ్ లో పాల్గొనలేదు. అయితే, స్థానిక సబ్-డివిజినల్ మెజిస్ట్రేట్ ఏక్తా సింగ్…ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ వారిని కోరుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.



మరోవైపు, లైన్ పార్ ఏరియాలోని కచ్ పురా గ్రామంలోని పోలింగ్ బూత్ నెం.358వద్ద కూడా పోలింగ్ ను బహిష్కరించారు స్థానికులు. తమ ఏరియాలో నీటి సంక్షోభం గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదని…అందుకే తాము పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు.