రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టులో కేంద్రం బాంబు పేల్చింది.రాఫెల్ డీల్ లో ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లు దాఖలుచేసినదాఖలైన రివ్యూ పిటిషన్లపై బుధవారం(మార్చి-6,2019) సుప్రీం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాఫెల్ డీల్ కు సంబంధించిన కీలక పత్రాలను ద హిందూ పత్రిక ఇటీవల ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన అటార్నీ జనరల్..రాఫెల్ డీల్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీ అయ్యాయి. అధికారిక రహస్య చట్టాల ప్రకారం..ఇలాంటి పత్రాలు ఉంచుకోవడం నేరం.దీనిపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని ఆయన కోరారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ స్పందిస్తూ..పత్రాల చోరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మధ్యాహ్నాంలోగా కోర్టుకి వెల్లడించాలని ఆదేశించారు.
అంతకుముందు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ..2018 డిసెంబర్-14న రాఫెల్ పై ఇచ్చిన తీర్పులో చాలా తప్పిదాలున్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టుని తప్పుదోవ పట్టించేందు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.