Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్, కంటైనర్ ఢీకొని 10 మంది భక్తులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి.

Road accident in Rajasthan

Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా – మనోహర్‌పూర్ రహదారిపై వ్యాన్, కంటైనర్ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 10మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలిలో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

మృతులంతా రాజస్థాన్‌లోని సికార్ జిల్లా పరిధిలో ఉన్న ఖతు శ్యామ్ టెంపుల్‌కు వెళ్లి తిరిగి తమ సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంపై దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదంలో 10మంది మరణించారు. తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించడం జరిగింది. ముగ్గురు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.