రాష్ట్రానికి కాదు.. ఓ ఇంటికి : రూ.23 కోట్ల కరెంట్ బిల్లు

  • Publish Date - January 23, 2019 / 09:08 AM IST

ఉత్తర్ ప్రదేశ్ : సామాన్య, మధ్య తరగతి ఫ్యామిలీకి కరెంటు బిల్లు ఎంతొస్తుంది…మాహా అంటే…రూ. 500 లేదా వెయ్యి. కానీ ఓ మధ్య తరగతి కుటుంబానికి రూ. 23 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసిన యజమానికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. గిది బిల్లేనా? అంటూ గుండె పట్టుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ ప్రాంతంలో జరిగింది.

అబ్దుల్ బాసిత్..కన్నౌజ్ ప్రాంతంలో నివాసం. ఇంటికి కరెంట్ వాళ్లు వచ్చి మీటర్ చూసి బిల్లు ఇచ్చారు. ఎంతొచ్చింది అని చూసిన బాసిత్‌కు దిమ్మ తిరిగిపోయింది. 178 యూనిట్లు వాడుకున్నారు.. రూ. 23,67,71,524 చెల్లించండి అని బిల్లులో ఉంది. అంకెలు అన్నీ చూసి అర్థం కాలేదు. బిల్లు నెంబర్ అనుకున్నాడు. పరిశీలించి చూస్తేగానీ షాక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం కాలేదు. గింత కరెంటు నేను వాడడం ఏంటీ అంటూ విద్యుత్ శాఖపై కోపం వ్యక్తం చేశాడు.

ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియచేశాడు. బిల్లును పరిశీలించిన అధికారులు.. నాలిక కరుచుకన్నారు. సారీ.. సాంకేతిక సమస్య వల్ల ఇలా వచ్చిందని వెల్లడించారు అధికారులు. విచారణ చేయిస్తామని.. తప్పును సరి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు బిల్లు కట్టకుండానే కరెంట్ వాడుకోండని భరోసా కూడా ఇచ్చారు.