Modi
PM Modi on Ukraine Crisis: యుక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత భారత్‌లో కూడా ఆందోళన సాగుతోంది. ఈ క్రమంలోనే అన్ని దేశాలు తమ పౌరులను తరలించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. అటువంటి పరిస్థితిలో, భారతదేశం కూడా ఈ దిశగా కసరత్తు చేస్తోంది. యుక్రెయిన్‌కు సంబంధించి ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రధాని మరో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గడచిన 24 గంటల్లో ఇది మూడో సమావేశం కాగా.. భారతీయుల తరలింపు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు. యుక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్న క్రమంలో భారత్ కూడా వేగంగా అడుగులు వేస్తోంది.
గత సమావేశంలో ఏం జరిగింది?
ఈరోజు(ఫిబ్రవరి 28) మధ్యాహ్నం యుక్రెయిన్‌లో పరిస్థితిపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. యుక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులతో సహా భారతీయులను తరలించే ప్రక్రియను సమన్వయం చేయడానికి నలుగురు కేంద్ర మంత్రులను యుక్రెయిన్‌కు పొరుగు దేశాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర మంత్రులు హర్దీప్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, వీకే సింగ్ యుక్రెయిన్ పొరుగు దేశాలకు భారత్ “ప్రత్యేక దూతలు”గా వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ఆపరేషన్ కోసం సింధియా రొమేనియా, మోల్డోవాతో సమన్వయం చేసుకుంటోంది ప్రభుత్వం.