శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించే కేసును సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన ర్రంలో అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుంతించే విషయంపై గందరగోళం ఏర్పడింది. మండల పూజ కోసం నవంబర్ 16 నుంచి అయ్యప్ప ఆలయం తెరవనున్నారు. 17 నుంచి భక్తులను అనుమతిస్తారు. ఈ సమయంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆలయ ప్రవేశం కోసం వచ్చే మహిళలు పబ్లిసిటీ కోసమే వస్తారని వ్యాఖ్యానించారు.
‘యాక్టివిజం ప్రదర్శించడానికి కార్యకర్తలు శబరిమలను ఎంచుకుంటామంటే కుదరదు. కొంతమంది పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి ప్రవేశిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. కేవలం ప్రచార యావతోనే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వం ఎంతమాత్రం ప్రోత్సహించదు’ అని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. అదే విధంగా శబరిమల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాగా…సుప్రీం కోర్టు2018 లో ఇచ్చిన తీర్పు ఆధారంగా శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళతామని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ చెప్పారు. అక్కడ మాకు రక్షణ కల్పించబడుతుందా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయం అని…రక్షణ కోసం కోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పటం కోర్టు తీర్పును అగౌరవపరచటమే అని అన్నారు.