సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు తమ సత్తా చూపించేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో ఈరోజు(జనవరి 19, 2019) కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి వివిధ రాష్ట్రాల నుంచి ఎన్డీయే, మోడీని వ్యతిరేకించే నాయకులందరూ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. దేశాన్ని విభజించాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే తాము ఐక్యపర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.పూర్తి మెజార్టీ ఉన్నప్పటికి కూడా బీజేపీ దేశాన్ని మోసగించిందన్నారు. పనిచేసే ప్రధాని కావాలని, ఎవరైతే పేదల కోసం, రైతుల కోసం పనిచేస్తారో అటువంటి ప్రధానిని తాము కోరుకుంటున్నామని తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకొంటున్న తప్పుడు పాలసీల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రాఫెల్ స్కామ్ లో కేంద్రం మునిగిపోయిందన్నారు. సుప్రీం కోర్టుని బీజేపీ తప్పుదోవ పట్టించిందన్నారు. సీబీఐ, ఈడీలను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకొంటుందన్నారు.
అమరావతిలో కూడా జరుగబోయే ఇలాంటి ర్యాలీకి ప్రాంతీయ పార్టీల నేతలు హాజరుకావాలని బాబు కోరారు. ప్రపంచంలో అభివృధ్ది చెందిన దేశాల్లో పేపరు బ్యాలెట్ ఉపయోగిస్తుంటే, ఇండియాలో మాత్రమే ఈవీఎంలు ఉపయోగిస్తున్నారని, వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. తన ప్రసంగాన్ని బెంగాల్ లో ప్రారంభించిన చంద్రబాబు తర్వాత ఇంగ్లీషులో ప్రసంగించారు.
మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ.. కలిసికట్టుగా మానిఫెస్టోని తయారుచేసి ముందుకెళ్లాలని తాను సీనియర్ ప్రాంతీయ పార్టీల నేతలను కోరుతున్నానన్నారు. తాను తక్కువకాలం దేశానికి ప్రధానిగా ఉన్నానని, దేశాన్ని నిర్మించడానికి స్థిరమైన దేశం ముఖ్యం అని తనకు తెలుసునన్నారు. బీజేపీకి ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినప్పటికీ ప్రజలకు మోడీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ప్రతిపక్షాల యాక్షన్ ప్లాన్ గురించి ప్రజలకు వివరిస్తూ వారిలో కాన్ఫిడెన్స్ పెంచాలని అన్నారు. అంకుముందు దేవెగౌడ గురించి మమత మాట్లాడుతూ దేవెగౌడ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కాదని, రైతుల ప్రధాని అని అన్నారు.