హే సాయి : సాయిబాబా జన్మస్థలం ఎక్కడ? షిర్డీనా ? పాథ్రీనా ? 

  • Publish Date - January 18, 2020 / 07:20 AM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పాథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. దీంతో పాథ్రీ ప్రాంతం తెరమీదకు వచ్చింది. 

పాథ్రీ అభివృద్ధి ప్రణాళికను గత ప్రభుత్వం ఆమోదించినట్లు పాథ్రీలోని శ్రీ సాయి ఆలయ జన్మ స్థాన ఆలయ ధర్మకర్త, NCP మాజీ ఎంఎల్‌సీ బాబా జానీ దురానీ వెల్లడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి థాకరే నిధులు అందుబాటులో ఉంచాలని సంబంధింత అధికారులను ఆదేశించారని, భూ సేకరణ, ప్రాజెక్టు కోసం నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడానికి కృషి చేస్తామన్నారు. 

పాథ్రీ అభివృద్ధి చేస్తే షిర్డీపై ప్రభావం చూపుతుందనే భయం అక్కడి వారిలో నెలకొందని దురానీ వెల్లడించారు. అయితే..షిర్డలోనే సాయిబాబా జన్మించారని నిరూపించాలని సవాల్ విసిరారు. తమ వాదనను వినిపించడానికి తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని, పాథ్రీ నివాసితులు అఖిలపక్ష కార్యాచరణ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారని వెల్లడించారు. 

 

దీనిని షిర్డీ నివాసితులు కొట్టిపారేస్తున్నారు. పాథ్రీ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ సాయిబాబా జన్మస్థలంగా అభివర్ణించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్థానిక కార్యకర్త నితిన్ కోటే తెలిపారు. షిర్డీలో జన్మించడానికి తమ వద్ద కూడా ఆధారాలున్నాయని, ఏపీలో కూడా పాథ్రీ అనే స్థలం ఉందన్నారు. సాయిబాబా మతాలకతీతంగా ఉన్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

మరోవైపు సీఎం ఉద్దవ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై షిర్డీ నివాశితులు శుక్రవారం సమావేశమయ్యారు. త్వరలో షిర్డీలో బంద్ పాటిస్తామంటున్నారు. శివసేన సభ్యులు కమలకర్ కోటే, సచిన్ కోటేతో, ఇతర రాజకీయ నేతలు చర్చలకు దిగారు. సీఎంతో సమావేశం కావాలని నిర్ణయించారు. చారిత్రాత్మక ప్రదేశాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. 

షిర్డీకి సుమారు 260 కిలోమీటర్ల దూరంలో పాథ్రీ ఉంది. కానీ ఇక్కడ తగిన సౌకర్యాలు లేవు. అదే షిర్డీలో అన్నీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. హోటల్స్, మెరుగైన రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నాయి. అంతేగాకుండా ఆలయ ట్రస్టు కూడా ఉంది. తాజాగా జరుగుతున్న వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 

Read More : షిర్డీ ఆలయం గురించి మీకు తెలియని విషయాలు