130కోట్ల మంది భారతీయులందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ భారత రాజ్యాంగానికి విరుద్దంగా మాట్లాడుతుందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఇదే విధానాన్ని నమ్మి ఉంటే ప్రధాని మోడీ…సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్నవాళ్లని వాళ్ల డ్రెస్ ల ఆధారంగా గుర్తించవచ్చని వ్యాఖ్యానించారని కాంగ్రెస్ నాయకుడు శక్తిసింఘ్ గోహిల్ అన్నారు. ఆ స్టేట్ మెంట్ నిజమే అయితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ దక్షణాదిలో ఒక బాష,ఉత్తరాదిలో ఒక బాష మాట్లాడుతుంటారని గోహిల్ అన్నారు.
ఎవరు భారతీయులో రాజ్యాంగం నిర్ణయిస్తుందని,భారత చట్టాలు ఎవరు భారతీయులో నిర్ణయిస్తాయని,భారతీయులు ఎవరో మోహన్ భగవత్ నిర్ణయించడని సీపీఎం నాయకురాలు బృందాకారత్ తెలిపారు. మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్నిఅంగీకరించడని ఆమె అన్నారు. కనీసం ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేసేముందు దయచేసి రాజ్యాంగాన్ని ఒకసారి చదవాలని ఆమె భగవత్ కు సూచించారు. భగవత్ వ్యాఖ్యలు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని బీఎస్పీ నాయకుడు సుధీంద్ర బడోరియా తెలిపారు. సమాజంలో ఘర్షణలు సృష్టించేవిధంగా భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.
బుధవారం(డిసెంబర్-26,2019)హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన విజయసంకల్ప సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మోహన్ భగవత్ మాట్లాడుతూ…కులాలు, మతాలతో సంబంధం లేకుండా దేశంలో ఉన్న 130 కోట్ల మంది హిందువులేనని అన్నారు. దేశంలో ఉన్నవారందర్నీ ఆరెస్సెస్ హిందువులుగానే పరిగణిస్తుందని చెప్పారు. ఐక్యతతో మెలగాలన్న కాంక్షతో సంఘ్ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు.