Delhi liquor scam
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal)కు సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ఆ పార్టీ మండిపడింది. ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సీబీఐ నోటీసులకు భయపడమని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని అన్నారు.
అందులో భాగంగానే సీబీఐ నోటీసులు పంపారని చెప్పారు. ఏప్రిల్ 16వ తేదీన కేజ్రీవాల్ సీబీఐ ఎదుట హాజరవుతారని ప్రకటించారు. అదేరోజున అర్వింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి, జైలుకు పంపడానికి కుట్ర పన్నారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గొంతు నొక్కలేరని చెప్పారు. బీజేపీనే పై నుంచి కింది వరకు అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. లక్షల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని మోదీ తన స్నేహితులకు ఇచ్చారని ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరాడుతారని చెప్పారు.
మోదీ అవినీతిని దేశవ్యాప్తంగా వివరిస్తామని అన్నారు. మోదీ స్నేహితుల కంపెనీల్లో లక్షల కోట్ల రూపాయల నల్లధనం పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీలో ఇదే విషయాన్ని కేజ్రీవాల్ చెప్పారని గుర్తు చేశారు. నిజాలను మోదీ తట్టుకోలేరని అన్నారు. కోర్టులో ఈడీ అసత్యాలు చెబుతోందని సంజయ్ సింగ్ చెప్పారు. సిసోడియా ఫోన్లను ధ్వంసం చేయలేదని అన్నారు.
వాంగ్మూలాల ఆధారంగా నోటీసులు
అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు పంపింది. ఎక్సైజ్ శాఖ కార్యదర్శి సి.అరవింద్, ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణను గతంలో సీబీఐ ప్రశ్నించింది. సిసోడియా సీబీఐ కస్టడీలో ఉన్న సమయంలోనే అధికారులను సీబీఐ అధికారులు విచారించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం మేజిస్ట్రేట్ ముందు సి.అరవింద్ వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై సిసోడియా నేరుగా సూచనలు ఇచ్చారని సి.అరవింద్ వెల్లడించారు.
సీబీఐతో పాటు ఈడీ వాంగ్మూలంలోనూ లిక్కర్ స్కాం 12 శాతం కమిషన్ అంశంపై సి.అరవింద్ వివరాలు తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలో సిసోడియా, సత్యేందర్ జైన్ సమక్షంలోనే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఈడీ చార్జిషీట్లో అరవింద్ కేజ్రీవాల్ పేరును ఇదివరకే ప్రస్తావించారు. అయితే ఇప్పటి వరకు ఎందులోనూ ఆయనను నిందితుడిగా పేర్కొనలేదు. ఈ నెల 16న విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తో పాటు మరికొందరు సాక్షులను పిలిచే అవకాశం ఉంది.
Delhi liquor scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు