లాకర్‌లో ఉన్న వస్తువు పోయినా దెబ్బతిన్నా బ్యాంకులదే బాధ్యత

locker safety responsibility of banks: బ్యాంకు లాకర్ల నిర్వహణ మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. బ్యాంకుల తీరుని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. లాకర్ల నిర్వహణలో బ్యాంకులు నామమాత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పింది. ప్రస్తుత లాకర్ నిర్వహణ నిబంధనలు గందరగోళంగా ఉన్నాయన్న కోర్టు.. ఆరు నెలల్లోగా లాకర్ సౌకర్యాల నిర్వహణపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, దేశవ్యాప్తంగా బ్యాంకులు అమలు చేసేలా చూడాలని ఆర్బీఐకి ఆదేశాలు జారీ సుప్రీంకోర్టు చేసింది. లాకర్ సదుపాయాల నిర్వహణలో బ్యాంకులు తీసుకునే తప్పనిసరి చర్యలను అందులో తెలపాలంది. మొత్తంగా లాకర్ల భద్రత బాధ్యత బ్యాంకులదే అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.

ప్రస్తుతం క్యాష్ లెస్ ఎకానమీ అవుతోంది. దీంతో చాలామంది తమ ఆస్తులను తమతో ఉంచుకోవడానికి సంకోచిస్తున్నారు. ఈ కారణంగా లాకర్ల సేవలకు గిరాకీ పెరుగుతోంది. ప్రతి బ్యాంకూ తప్పనిసరిగా అందివ్వాల్సిన సేవగా ఇది మారింది అని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎం. శాంతనగౌడర్, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

లాకర్ హోల్డర్లకు లిఖితపూర్వక నోటీసు లేకుండా బ్యాంకులు ఓపెన్ లాకర్లను విచ్ఛిన్నం చేయలేవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రపంచీకరణ కారణంగా దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని, సామాన్యుల జీవితంలో బ్యాంకింగ్ సంస్థలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయని సుప్రీంకోర్టు అంది. అటువంటి సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా లాకర్స్ ప్రతి బ్యాంకింగ్ సంస్థ అందించే ముఖ్యమైన సేవగా మారాయంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇప్పుడు డ్యూయల్ కీ-ఆపరేటెడ్ లాకర్ల నుంచి ఎలక్ట్రానిక్ ఆపరేటెడ్ లాకర్లకు మారుతున్నారనే విషయాన్ని విస్మరించరాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

ఎలక్ట్రానిక్ ఆపరేటెడ్ లాకర్లలో వినియోగదారుడు పాస్‌వర్డ్‌లు లేదా ఏటీఎం పిన్ మొదలైన వాటి ద్వారా లాకర్‌కు పాక్షిక సెక్యూరిటీ కలిగి ఉన్నప్పటికీ, అటువంటి లాకర్ల ఆపరేషన్‌ను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు కలిగి ఉండరని బెంచ్ గుర్తుచేసింది. వినియోగదారులకు తెలియకుండా లేదా సమ్మతి లేకుండా లాకర్లకు సెక్యూరిటీ పొందడానికి ఈ వ్యవస్థలలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దురాక్రమణదారులు తారుమారు చేసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో తమకెలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం బ్యాంకులకు తగదని సుప్రీం చెప్పింది.

బ్యాంకుల ఇటువంటి చర్యలు వినియోగదారుల రక్షణ చట్టం సంబంధిత నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న మన ప్రతిష్టకు హాని కలిగిస్తాయంది. అందువల్ల లాకర్ సౌకర్యం / సురక్షిత డిపాజిట్ సదుపాయాల నిర్వహణకు సంబంధించి బ్యాంకులు తీసుకోవలసిన చర్యలను తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ సమగ్ర సూచనలు ఇవ్వడం అవసరమని కోర్టు తెలిపింది. వినియోగదారులపై ఏకపక్ష, అన్యాయమైన నిబంధనలను విధించే స్వేచ్ఛ బ్యాంకులకు ఉండకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని 6 నెలల్లోగా లాకర్‌ సదుపాయానికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీం ధర్మాసనం ఆర్బీఐని ఆదేశించింది.

బకాయి చెల్లించలేదనే కారణంతో వినియోగదారుడి అనుమతి లేకుండానే ఓ బ్యాంకు అతడి లాకర్ తెరిచింది. అందులో ఉంచిన ఆభరణాలను తిరిగిచ్చేసింది. అయితే అందులో కొన్ని మిస్ అయ్యాయి. దీంతో అతడు కోర్టుని ఆశ్రయించాడు. ఈ వ్యహారంలో సుప్రీంకోర్టు బ్యాంకుల తీరుపై సీరియస్ అయ్యింది.