దీపావళి తర్వాతే తెరుచుకోనున్న స్కూళ్లు

  • Publish Date - November 8, 2020 / 04:39 PM IST

Schools and Temples reopening after diwali  : కరోనా మహమ్మారి వ్యాప్తితో మూతపడ్డ స్కూళ్లు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలన్నీ త్వరలోనే తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ దీపావళి తర్వాతే పాఠశాలలను ప్రారంభించనున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వెల్లడించారు.

కరోనా కారణంగా మార్చి నుంచి దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు, స్కూళ్లు మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేసేందుకు ఈ దీపావళి తర్వాత స్కూళ్లు (9 నుంచి 12 తరగతులకు) తిరిగి ప్రారంభమవుతాయని అన్నారు.

సీఎం ఉద్దవ్‌ ఠాక్రే ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలలను ఈనెల 23న తెరుస్తామన్నారు.

విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నట్టు చెప్పారు. ఒక్కో బెంచికి ఒక్క విద్యార్థిని మాత్రమే కూర్చోనిస్తామన్నారు. తరగతులను రోజు విడిచి రోజు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు ఠాక్రే పేర్కొన్నారు. కోవిడ్‌ నిబంధనలను రూపొందించి త్వరలోనే దేవాలయాలను తిరిగి ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.