‘ముస్లీంలు బీజేపీకి ఓటెయ్యరు.. అందుకేయ వాళ్లకు సీట్లు ఇవ్వం’. ఈ మాట అంటున్నది ఏ ప్రతిపక్ష నేతో.. అసమ్మతి నాయకుడో కాదు.. కర్నాటక బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ ఉపముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప. ముస్లింలకు బీజేపీపై విశ్వాసం లేదని, అందుకే వారికి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్లు ఇవ్వట్లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో కూడా తాము ముస్లింలకు టికెట్లు ఇవ్వబోమని, వారు తమ పార్టీకి ఓట్లు వేయరని స్పష్టం చేశారు. ముస్లీంలు తమను అర్ధం చేసుకుంటే వారికి టికెట్లు ఇచ్చే విషయమై పరిశీలిన చేస్తామని ఈశ్వరప్ప చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తుందని ఈశ్వరప్ప ఆరోపించారు. కాగా ఈశ్వరప్ప వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తనకు ముస్లింలు సహా ఏ వర్గంపైనా ఎలాంటి ద్వేషం లేదని చెప్పారు. పార్టీ నేత ఇక్బాల్ అన్సారీకి బీజేపీ టికెట్ ఇచ్చే విషయమై అడిగిన ప్రశ్నకు బదులిస్తూనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఈశ్వరప్ప ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలకు మతం రంగు పులమకండి అంటూ ఈశ్వరప్ప ట్విట్టర్ ద్వారా కోరారు.