DK Shivakumar: కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పదవి శాశ్వతం కాదని ఆయన అన్నారు. ఇతరులకూ అవకాశం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో డీకే శివకుమార్ మాట్లాడారు. ఐదేళ్లుగా ఈ పదవిలో ఉన్నా, ఇక మార్పు ఉంటుందనే సంకేతం ఇచ్చారాయన. కర్నాటకలో సీఎం మార్పుపై ఊహాగానాల వేళ డీకే శివకుమార్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘‘పీసీసీ అధ్యక్ష పదవిని నేను శాశ్వతంగా చేపట్టలేను. ఇప్పటికే ఐదున్నరేళ్లు గడిచాయి. వచ్చే మార్చికి ఆరేళ్లు పూర్తవుతాయి. ఇతరులకూ అవకాశం ఇవ్వాలి. 2023 మేలో డిప్యూటీ సీఎం అయ్యాక పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అనుకున్నా. కానీ.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మరికొంత కాలం కొనసాగాలని నన్ను కోరారు. పార్టీ అధ్యక్ష పదవిలో నేను ఉన్నానా? లేదా? అనేది ముఖ్యం కాదు. పార్టీ నాయకత్వం విషయంలో ముందు వరుసలో ఉంటాను. నా పదవీకాలంలో 100 పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నా’’ అని డీకే శివకుమార్ తెలిపారు.
కర్ణాటక సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్ ఆశిస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లైంది. తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు డీకే శివకుమార్ సంకేతాలు ఇచ్చినట్లుంది. అయితే, ఆందోళన చెందాల్సిన పని లేదని తన అనుచరులకు ఆయన భరోసా ఇచ్చారు. తాను పార్టీ నాయకత్వంలోనే ఉంటానని స్పష్టం చేశారు.
సీఎం మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్దరామయ్య స్థానంలో డీకే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎ పదవిని వదులుకునేందుకు సిద్ధరామయ్య అస్సలు ఇష్టపడటం లేదు. సీఎం పదవిలో పూర్తి కాలం తానే కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు సమాచారం. అంతేకాదు వచ్చే ఎన్నికలకు డీకే శివకుమార్ ను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిద్దామని సూచించారట.