Adar Poonawalla : భారతీయ విద్యార్థులకు రూ.10 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించిన అదర్‌ పూణావాలా

ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లి క్వారంటైన్ లో ఉన్న విద్యార్థులకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా రూ.10 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించారు. భారతీయ వ్యాక్సిన్లకు బ్రిటన్ లో అనుమతి లేకపోవడంతో ఇక్కడ రెండు డోసులు తీసుకున్న వారు కూడా బ్రిటన్ వెళ్తే క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించిన హోటల్స్ లో మన విద్యార్థులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. అవన్నీ పెద్ద హోటల్స్ కావడంతో భారీగా డబ్బు ఖర్చవుతుంది.

Adar Poonawalla

Adar Poonawalla : భారత్ లో తయారైన వ్యాక్సిన్లకు పలు దేశాలు యాక్సెప్టబుల్ వ్యాక్సిన్‌గా ఇప్పటికీ ఆమోదించలేదు. దీంతో ఆ దేశాలకు వెళ్లిన భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. ఇతర పనుల మీద వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉన్నా.. విద్యార్థుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ఆయా దేశాలు కోవిషిల్డ్, కొవాక్సీన్ టీకా తీసుకున్న వారిని దేశంలోకి నేరుగా అనుమతించడం లేదు. 10 నుంచి 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని నిబంధన పెడుతున్నాయి. ఈ నిబంధన విద్యార్థుల జేబులు ఖాళీ చేస్తుంది.

మే, జూన్ నెలల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదు కావడంతో యూకే ప్రభుత్వం భారత్‌ను రెడ్ లిస్ట్ జాబితాలో పెట్టింది. అంటే భారత్ నుంచి వచ్చే వారు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ క్వారంటైన్ కూడా భారతీయులకు ఇష్టమైన దగ్గర కాకుండా బ్రిటన్ ప్రభుత్వం అప్రూవ్ చేసిన హోటళ్లలోఉండాల్సి వస్తుంది. క్వారంటైన్ ఖర్చును ప్రయాణికులే భరించాలి. దీంతో ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఈ నిబంధన వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువుకోసం తీసుకెళ్లిన డబ్బులో సంగం డబ్బు ఈ పదిరోజుల క్వారంటైన్ కే అయిపోతుందని వాపోతున్నారు.

ఇక వీరి బాధలు అర్ధం చేసుకున్న కొన్ని స్వచ్చంద సంస్థలు వీరికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. క్వారంటైన్ లో ఉన్న విద్యార్థులకు ఖర్చులకు డబ్బు అందిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు అన్‌లాక్ ఎడ్యుకేషన్ పేరిట ఫండ్ రైజింగ్ చేస్తున్నాయి. ఎవరైనా ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే తమ వివరాలను ఆన్‌లైన్ ఫామ్‌లో నమోదు చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వారికి ఈ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం చేస్తారు. ఇక విద్యార్థుల ఇబ్బందులు చూసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్‌ పూణావాలా వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన వంతుగా రూ.10 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అడర్ పూనావల్లా.

అర్హులైన విద్యార్థులకు క్వారంటైన్ ఖర్చుల కోసం అన్‌లాక్ ఎడ్యుకేషన్ ఫండ్ కింద రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్యంగా లోన్లు, స్కాలర్‌షిప్స్‌తో చదువుకునే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక 10 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలంటే మన కరెన్సీలో రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. పేద విద్యార్థులకు ఇది భరించడం కష్టమే.. అందుకే మానవతా దృక్పధంతో కొన్ని స్వచ్చంద సంస్థలు ముందడుగు వేసి విద్యార్థులకు ఆర్ధిక సాయం చేస్తున్నాయి.