సోనియా రిటైర్మెంట్…యూపీఏ చీఫ్ గా శరద్ పవార్!

Sharad Pawar Emerges Frontrunner to be Next UPA Chairperson యూపీఏ చైర్ పర్శన్ గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్నిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ తన బాధ్యతలను వేరొకరికి అప్పగించి రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా స్థానంలో శరద్ పవార్ ఆ బాధ్యతలను చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.



కొంత కాలంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీన పడుతుండడంతో యూపీఏ దాదాపు పతనావస్థలో ఉంది. సొంత పార్టీనే నిలబెట్టలేని స్థితిలో కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో యూపీఏకు మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే యూపీఏకి కాంగ్రెసేతరులు నాయకత్వం వహిస్తే పరిస్థితులు మెరుగు పడొచ్చనే ఊహగానాలు 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవార్ పేరు తెరపైకివచ్చింది. యూపీఏ చైర్మన్ పదవికి పవార్ అయితేనే పవర్‌ఫుల్‌గా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



వచ్చే ఏడాది కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించనుంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సుముఖంగా లేనట్టు అర్థమవుతోంది. దీంతో కాంగ్రెస్ కు కొత్త బాస్ త్వరలోనే రానున్నట్లు అర్థమవుతోంది. కాగా,గదేడాది లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో సోనియా గాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలిక పార్టీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షడయ్యే సమయంలో పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన సోనియా యూపీఏ చైర్ పర్శన్ గా మాత్రం వైదొలగలేదు.



యూపీఏ చీఫ్ గా,పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియానే కొనసాగుతూ వచ్చారు. అయితే,ఈ సారి ఆమె పూర్తిగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. యూపీఏ చైర్ పర్శన్ పదవి నుంచి తప్పుకోవాలని సోనియా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా స్థానంలో యూపీఏ పగ్గాలను శరద్ పవార్ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.



అయితే, ఎన్సీపీ మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. యూపీఏలో ఉన్న మిత్ర పార్టీలతో ఇలాంటి చర్చలు ఏవీ జరగలేదని,అలాంటి ప్రతిపాదనలు తమ వరకు రాలేదని ఎన్సీపీ నేత మహేష్ తపసీ తెలిపారు. రైతులుఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని మీడియా సంస్థలు పుట్టిస్తున్న పుకార్లే ఇవని మహేష్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు