మహారాష్ట్రలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తనీయకుండా శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఇవాళ శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ తో సమావేశం అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రాజ్యసభ సెషన్ గురించి సంజయ్,తాను మాట్లాడుకున్నట్లు పవార్ తెలిపారు.
శివసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారని పవార్ తెలిపారు. వీలైనంత త్వరగా వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకుండా ఉండాలంటే శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి తీర్పునిచ్చారన్నారు. తాము ప్రతిపక్షంలోనే ఉంటామని సృష్టం చేశారు. శివసేన-ఎన్సీసీ ప్రభుత్వ ఏర్పాటు అనే ప్రశ్నే లేదని అన్నారు. బీజేపీ-శివసేన గత 25సంవత్సరాలుగా కలిసి ఉన్నాయని,ఇవాళ,రేపు మళ్లీ వాళ్లు కలిసి నడుస్తారని అన్నారు.
తమకు 170మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని సంజయ్ రౌత్ చేస్తున్న వ్యాఖ్యలపై పవార్ ని మీడియా ప్రశ్నించగా…ఆ లెక్క తమ పార్టీ,కాంగ్రెస్ పార్టీ సభ్యులను కలిపి చేసింది కాదన్నారు. ఎలా మీకు 170 మంది మద్దుతు ఉంది అని తాను కూడా సంజయ్ ని అడగాలనుకుంటున్నట్లు పవార్ తెలిపారు. గత నెల 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటిమికి స్పష్టమైన మెజారిటి వచ్చినప్పటికీ శివసేన 50:50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగుస్తుంది.