వివిధ అంశాల్లో సొంతపార్టీ నాయకత్వంపైనే రోజూ విమర్శలు చేస్తూ ఉండే బీజేపీ రెబల్ ఎంపీ శతృఘ్నసిన్హాపై బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వైదొలగాలని సుశీల్ కుమార్ సలహా ఇచ్చారు. మంగళవారం(జనవరి 12,2019) ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో సుశీల్ మాట్లాడుతూ… మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాతో స్నేహం వల్లనే శతృఘ్నసిన్హా సొంతపార్టీపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని శతృఘ్నసిన్హాకు సలహా ఇచ్చారు. కేంద్రమంత్రిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్ సభ సభ్యుడు అయ్యేందుకు అవకాశమిచ్చిన బీజేపీ పై విమర్శలు చేస్తున్న శతృఘ్నసిన్హా పార్టీ వదిలి వెళ్లిపోవాలని అన్నారు.
జీఎస్టీ, నోట్లరద్దు విషయంలో సిన్హా చేసిన విమర్శలు బీజేపీని ఇబ్బందిపెట్టాయని అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ని కలిసి అతడి కొడుకుని బీహార్ సీఎంగా సిన్హా ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదని సుశీల్ అన్నారు. నంద్ కిషోర్ యాదవ్, సంజీవ్ చౌరాసియా, అరుణ్ కుమార్ సిన్హా వంటి బీజేపీ నేతల సమిష్ఠి కృషి వల్లే 2014 ఎన్నికల్లో పాట్నా నియోజకవర్గం నుంచి శతృఘ్నసిన్హా విజయం సాధించారని అన్నారు. పార్టీ ఆదేశిస్తే తాను పాట్నా నుంచి పోటీ చేస్తానని సుశీల్ తెలిపారు. తాను బీజేపీలో పుట్టటానని, బీజేపీలోనే చనిపోతానని తెలిపారు.
అయితే 2019లో కూడా పాట్నా నుంచే మరోసారి పోటీచచేయనున్నట్లు అదే కార్యక్రమంలో పాల్గొన్న శతృఘ్న సిన్హా క్లారిటీ ఇచ్చారు కానీ ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం చెప్పలేదు. బీజేపీ తనకు ఖచ్చితంగా టిక్కెట్ ఇవ్వదని, తాను సొంతంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. సిన్హా ఆర్జేడీలో చేరుతాడనే ప్రచారం కొంతకాలంగా జరుగుతుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ని చాలా పరిణితి చెందిన నాయకుడు అని సిన్హా పిలుస్తుంటారు.రాహుల్ గాంధీని కూడా సిన్హా బహిరంగంగానే ప్రశంసిస్తుంటారు.